భారత్ న్యూస్ విజయవాడ…బిగ్‌బాస్ కంటెస్టెంట్, రేడియో జాకీ(ఆర్‌జే) శేఖర్ బాషాను సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. యూట్యూబర్ హర్షసాయి బాధితురాలు చేసిన ఫిర్యాదు మేరకు శేఖర్ బాషాను విచారించిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. శేఖర్ బాషా యూట్యూబ్ చానల్స్‌లో తప్పుడు ప్రచారం చేస్తూ తన పరువుకు భంగం కలిగిస్తున్నాడని బాధితురాలు ఇటీవల పోలీసులను ఆశ్రయించింది.
కాగా, యూట్యూబర్ హర్షసాయి పెళ్లి చేసుకుంటానని నమ్మించి తన వద్ద రూ. 2కోట్ల వరకు తీసుకున్నాడని, అత్యాచారం చేసి మోసం చేశాడని ఆమె కొద్ది రోజుల క్రితం నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ కేసు దర్యాప్తులో ఉండగా నిందితుడు హర్షసాయి పరారీలో ఉన్నాడు. మరోపక్క, సినీ నటుడు రాజ్ తరుణ్ కేసు విషయంలోనూ శేఖర్ బాషా మీడియాలో హల్‌చల్ చేసిన సంగతి తెలిసిందే.