.భారత్ న్యూస్ అమరావతి..ఏపీకి మేం పోము.. ఆమ్రపాలితో పాటు ఆ IASల భయమిదే?
ఈ ఏడాది జూన్ 14.. విభజిత ఏపీగా రెండో సారి బాధ్యతలు స్వీకరించిన తర్వాత చంద్రబాబు సచివాలయంలోకి తొలిసారిగా అడుగుపెట్టారు. చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలపడానికి ఐఏఎస్ అధికారులంతా క్యూకట్టారు. దీంతో సీఎం చాంబర్ అంతా సందడిగా ఉంది. అందరి నుంచి బొకేలు స్వీకరించిన చంద్రబాబు ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి బొకేను మాత్రం తిరస్కరించారు. దీంతో అక్కడున్న వారంతా షాక్ అయ్యారు. గత ప్రభుత్వ హయాంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్‌మెంట్ సెక్రటరీగా పని చేసిన ఆమె.. వైసీపీ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించారన్న ఆరోపణలే చంద్రబాబు ఆగ్రహానికి కారణం. ఆ తర్వాత ఆమెను పక్కన పెట్టేశారు.
కేవలం ఆమె మాత్రమే కాదు.. చీఫ్ సెక్రటరీ, సీఐడీ చీఫ్.. ఇలా అప్పటి వరకు కీలకంగా పని చేసిన అనేక ముఖ్య అధికారులందరికీ షాక్ ఇచ్చింది చంద్రబాబు సర్కార్. ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు, కాంతిరాణా టాటా, విశాల్‌గున్నిపై కేసులు కూడా నమోదయ్యాయి. నటి జెత్వాని వేధింపుల కేసులో వీరు సస్పెన్షన్ కు గురయ్యారు. వీరంతా జగన్ అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబును, టీడీపీ నేతలను ఇబ్బంది పెట్టారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. లోకేష్ రెడ్ బుక్ లో వీరి పేర్లు ఉన్నాయన్న టాక్ కూడా ఉంది. వీరితో పాటు పదుల సంఖ్యలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై కూడా చంద్రబాబు సర్కార్ సీరియస్ గా ఉంది. వీరిలో చాలా మందికి ఇంకా పోస్టింగ్ కూడా ఇవ్వలేదు.
జగన్ సర్కార్ కూడా..
గత జగన్ సర్కార్ పై కూడా చంద్రబాబు, టీడీపీ కసం పని చేశారన్న ఆరోపణలతో అనేక మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను పక్కన పెట్టింది. అంతకు ముందు ఇంటెలీజెన్స్ చీఫ్ గా పని చేసిన ఏబీ వెంకటేశ్వరరావుకు అయితే జగన్ చుక్కలు చూపించాడన్న చర్చ ఉంది. ఆయనను సస్పెండ్ చేసి.. క్యాట్ చెప్పినా పోస్టింగ్ ఇవ్వకుండా ఇబ్బంది పెట్టిందన్న ఆరోపణలు ఉన్నాయి. ఎట్టకేలకు కోర్టు ఆదేశాలతో పదవీ విరమణకు ఒక్క రోజు ముందు ఆయనకు పోస్టింగ్ దక్కింది.
అయితే.. ఇప్పుడు వాకాటి కరుణ, వాణి ప్రసాద్, రొనాల్డ్ రోస్, ఆమ్రపాలి, సృజన, శివశంకర్, హరికిరణ్ తదితర ఐఏఎస్ అధికారులు ఏపీకి కేటాయించిన తర్వాత తాము తెలంగాణలోనే ఉంటామని కోర్టును ఆశ్రయించడం చర్చనీయాంశమైంది. ఏపీలో ప్రభుత్వాలు మారిన ప్రతీ సారి గతంలో కీలకంగా పని చేసిన అధికారులకు ఇబ్బందులు ఉంటాయని.. అందుకే చాలా మంది భయపడుతున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ ఆరుగురు ఐఏఎస్ అధికారులు కూడా ఏపీకి వెళ్లేందుకు ఆసక్తిగా లేరన్న టాక్ వినిపిస్తోంది.