
అమరావతి పనుల పునః ప్రారంభం సభకు మాజీ ముఖ్యమంత్రి జగన్ అనుకున్నట్టే డుమ్మా కొట్టారు. ప్రధాని సభకు హాజరవ్వాలని ప్రభుత్వం ఆహ్వానం పంపినా ఆయన బెంగళూరు వెళ్లిపోయారు. మూడు రాజధానుల నినాదంతో అమరావతిని అభివృద్ధి చేయకుండా అతలాకుతలం చేసిన జగన్‌కు.. తిరిగి అమరావతి పునరుజ్జీవం పోసుకోవడాన్ని మింగుడు పడటం లేదన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఏపీని అయిదేళ్ళు సీఎం గా పాలించిన జగన్ రాష్ట్ర ప్రగతి కోసం బాటలు పడుతున్న తరుణంలో ఆహ్వానించినా కార్యక్రమానికి డుమ్మా కొట్టడంపై జోరుగా చర్చ నడుస్తోంది.
కలల రాజధాని సాకారమౌతున్న వేళ అమరావతికి భూములిచ్చిన రైతుల పోరాటం అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచింది. భారతదేశంలో జరిగిన చారిత్రక ఉద్యమాల్లో అమరావతి ఉద్యమం ఒకటి. భుక్తి కోసం, భూమి కోసం జరిగిన ఉద్యమాలను చూసిన ప్రజలు వైసీపీ ప్రభుత్వం, జగన్ అడ్డగోలు నిర్ణయాల పుణ్యమా అని రాజధాని ఉద్యమాన్ని చూడాల్సి వచ్చింది. రాజధాని కోసం అకుంఠిత దీక్షతో 1,631 రోజుల పాటు రైతు కుటుంబాలకు చెందిన చిన్నారుల నుంచి వృద్ధుల వరకూ జరిపిన పోరాటం ఓ చరిత్ర, వారి తెగింపు ఒక స్ఫూర్తి.
వారి పుణ్యాన చెదిరిన ప్రజా రాజధాని స్వప్నం సాకారమౌతోంది. వైసీపీ పాలనలో ఐదేళ్ల పాటు అధోగతిపాలైన అమరావతి ఇక తిరిగి జీవం పోసుకుంటోంది. ఆంధ్రుల కలల రాజధాని అమరావతి పునులు పున: ప్రారంభమయ్యాయి. ప్రధాని నరేంద్ర మోడీ ప్రజా రాజధాని అమరామతి పనులను తిరిగి ప్రారంభించారు.
హైటెక్ సీఎం చంద్రబాబు తన విజనరీతో అమరావతి అద్బుత నగరంగా నిర్మించేలా ప్లాన్ చేశారు. 2014లో రాష్ర్ట విభజన తర్వాత రాజధాని లేని రాష్ర్టంగా ఉన్న ఆంధ్రపదేశ్‌కు ఏర్పాటు చేయబోయే రాజధాని.. రాష్ర్టం మొత్తానికి ఆర్దికంగా ఆయువు పట్టుగా, అందరికీ అందుబాటులో ఉండాలని భావించిన చంద్రబాబు… దాదాపు 54 వేల ఎకరాల్లో అమరావతి నిర్మాణానికి సంకల్పించారు. హైటెక్ సిటీ నిర్మించి హైదరాబాద్‌ను అంతర్జాతీయ నగరంగా మలిచిన చంద్రబాబు పాలనా పటిమపై అప్పటికే రాష్ర్ట ప్రజలకు అంచంచల విశ్వాసం ఉంచి… చంద్రబాబు ఇచ్చిన ఒక్క పిలుపుతో ప్రభుత్వానికి రూపాయి ఖర్చు లేకుండా దాదాపు 30 వేల మంది రైతులు 35 వేల ఎకరాలకు భూ సమీకరణ ద్వారా అందించారు.
2014-19 మధ్య కాలంలో 55 పనులకు 42,500 కోట్ల రూపాయలతో టెండర్లను పిలిచారు. 2019 నాటికి 4, 322 కోట్ల రూపాయల విలువైన పనులు పూర్తయ్యాయి. అయితే 2019లో ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్ అమరావతిని కొనసాగిస్తానన్న హామీని తుంగలో తొక్కి ప్రజా రాజధానిపై కక్ష పెంచుకున్నారు. అమరావతిపై ఒక సామాజికవర్గ ముద్ర వేసి పనులను ఎక్కడిక్కడే అపేశారు. మూడు రాజధానులంటూ మూడు ముక్కలాట ఆడారు. ప్రజా రాజధాని కోసం త్యాగం చేసి భూములిచ్చిన రైతులు.. జగన్ ప్రభుత్వంపై 1,631 రోజుల పాటు అలుపెరగని పోరాటం చేశారు. పాదయాత్రలు చేసి రాష్ర్ట వ్యాప్తంగా జగన్ తీరును ఎండగట్టారు. రైతులన్న విచక్షణ లేకుండా ఉద్యమాన్ని అణగదొక్కేందుకు పోలీసులను ఉపయోగించారు. పోలీసుల లాఠీల దెబ్బలకు వళ్లు హూనమైనా రైతులు వెనక్కి తగ్గలేదు.
చివరికి అమరావతి స్థాన బలం, రైతుల పోరాటం, దేవతల ఆశీర్వాదాలతో రాజధాని మళ్లీ ఊపిరిపోసింది. 2015లో ఇదే అమరావతికి శంకుస్థాపన చేసిన ప్రధాని నరేంద్ర మోడీ తిరిగి అమరావతి వచ్చి వేల కోట్ల రూపాయల అభివృద్ది పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం పద్దతి ప్రకారం అమరావతి పునః ప్రారంభం సభకు రావాలని ఆహ్వాన పత్రికను జగన్‌కు పంపింది. అయితే 2015లో ప్రతిపక్ష నేతగా ఉండి అమరావతి పనుల ప్రారంంభోత్సం రోజున కూడా హాజరు కాని జగన్ ఈ సారి కూడా ముఖం చాటేశారు..
ప్రధాని నరేంద్ర మోడీ అమరావతి రాజధాని పునర్ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. ఒక విధంగా చూస్తే ఇది ప్రభుత్వ కార్యక్రమం చుట్టారు. అధికారికంగా నిర్వహిస్తున్న ఈ వేడుకకు విపక్ష నేతగా జగన్ కి ఆహ్వానం పంపినా ఆయన ముందురోజే బెంగళూరు ఫ్లైటెక్కి వెళ్లిపోవడం చర్చనీయాంశమైంది. ఇప్పుడు ప్రధాని పున: ప్రారంభించిన పనుల్లో చాలా వరకు జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నిలిపివేసినవే. టీడీపీ హయంలోనే సగం పూర్తైన నిర్మాణ పనులు అర్ధంతరంగా అపేశారు. అమరావతిని సశ్మానంతో పోల్చుతూ వైసీపీ నేతలు కామెంట్స్ చేశారు. అలాగని మూడు రాజధానుల దిశగా ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోయారు.
కేంద్రం సహకారంతో అమరావతి రాజధాని పనులు శరవేగంతో పరుగులు పెట్టనున్నాయి. జగన్ హయంలో నిలిచిపోయిన పనులను తిరిగి ఇప్పటి కూటమి ప్రభుత్వం పున:ప్రారంభించేందుకు శ్రీకారం చూట్టింది. రాజధానికి చట్టబద్దత కల్పించడానికి చంద్రబాబు ధృడసంకల్పంతో పావులు కదుపుతున్నారు. అంటే ఇక ఎప్పటికీ అమరావతే ఏపీ రాజధాని. ఎవరు అధికారంలోకి వచ్చినా రాజధాని విషయంలో కప్పగంతులు వేయడానికి ఉండదు. అది గ్రహించే జగన్ అమరావతిలో జరిగే ఈవెంట్‌లో పాల్గొనడానికి ముఖం చెల్లక బెంగళూరు చెక్కేశారంటున్నారు.
కిందపడ్డా మాదే పైచేయి అన్నట్లు.. ఇప్పటికీ కూటమి ప్రభుత్వం అమరావతిలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలపై వైసీపీ విమర్శలు చేస్తూనే ఉంది. మూడు రాజధానుల ప్రతిపాదనను రాష్ట్రంలోని మూడు ప్రాంతాల ప్రజలు ఓటుతో తిరస్కరించినా ఆ పార్టీ నేతల వైఖరి మారడం లేదు. అప్పులు చేసి అమరావతి నిర్మించాల్సినవసరం ఏంటని వైసీపీ నేతలు ప్రశ్నిస్తూనే ఉన్నారు. అభివృద్ధి పేరిటి అప్పులు చేసి అమరావతి నిర్మిస్తే…మిగిలిన ప్రాంతాల అభివృద్ధి మాటేంటని వితండవాదం చేస్తున్నారు. ఏదేమైనా ఏపీ రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించిన మహత్తర కార్యక్రమానికి రావడానికి ముఖం చెల్లక మాజీ ముఖ్యమంత్రి.. రాజధాని ప్రాంతంలో ఉన్న తన ప్యాలెస్ నుంచి వేరే రాష్ట్రానికి వెళ్లిపోవడం తీవ్ర విమర్శల పాలవుతోంది.