
అమరావతి రాజధాని విషయంలో వైసీపీ స్టాండ్ మారలేదా? … గుంటూరు, కృష్ణా జిల్లాలు సహా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలు చిత్తుగా ఓడించినా జగన్ సైన్యం ఇంకా అమరావతిపై అక్కసు వెల్లగక్కుతూనే ఉంది. రాజధాని పనులు పున:ప్రారంభోత్సవ సభ తర్వాత కూడా వాళ్ల మళ్లీ పాత పాటనే ఎత్తుకోవడం చర్చనీయాంశంగా మారింది. అమరావతిపై ఒక సామాజికవర్గం ముద్ర వేసి దాన్ని అణగదొక్కడానికి చూసిన జగన్.. మూడు రాజధానుల పాలసీ వినిపించారు. తీరా చూస్తే రాష్ట్రంలోని మూడు ప్రాంతాల వాసులు వైసీపీని ఓడించి అమరావతికి తమ సంఘీభావం ప్రకటించారు. అయినా ఆ పార్టీ నేతలు పాతపాటే పాడుతుండటం వెనుక ఆంతర్యం ఏంటి?
ఏపీలో అమరావతి రాజధానిని ఒక రాజకీయ అంశంగానే వైసీపీ చూస్తున్నట్లు కనిపిస్తోంది. దేశంలో గడచిన పాతికేళ్లలో ఉత్తరాఖండ్, జార్ఖండ్, ఛత్తీస్ ఘడ్ వంటి కొత్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి. అక్కడ కూడా కొత్తగా రాజధానులు నిర్మించారు… ఆ రాష్ట్రాల్లో అధికార, విపక్ష పార్టీలు అన్ని కలిసి రాజధాని నిర్మాణానికి పరస్పరం సహకరించుకున్నాయి. కానీ ఏపీలో మాత్రం పరిస్ధితులు భిన్నంగా తయారయ్యాయి. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిని రాజధానిగా ఎంపిక చేశారు….రైతులు ముందుకొచ్చి భూములిచ్చారు. అప్పట్లో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ సైతం దానికి ఆమోదం తెలిపింది.
అమరావతే రాజధాని అంటూ అసెంబ్లీలోనూ ప్రకటన చేశారు. ఆ సందర్భంలో వైసీపీ కూడా అమరావతికి మద్ధతు ప్రకటించింది. అంతే కాదు 2019 ఎన్నికల ముందు కూడా తమ పార్టీ ప్రధాన ఆఫీసుతో పాటు అధినేత నివాసం కూడా అమరావతిలోనే ఉందని వైసీపీ నేతలు ప్రచారం చేసుకున్నారు.. అలాగే ఎన్నికల ముందు తాడేపల్లి ప్యాలెస్‌లోకి జగన్ గృహ ప్రవేశం చేశారు. ఇక ఆ ఎన్నికల్లో గెలిచిన తరువాత అమరావతి రాజధాని విషయంలో వైసీపీ మాట మార్చింది. అభివృద్ధి పునరేకీకరణ అంటూ మూడు రాజధానుల నినాదంలో వైసీపీ హడావుడి మొదలుపెట్టింది. అసెంబ్లీలో మూడు రాజధానుల నినాదం వినిపించిన అప్పటి ముఖ్యమంత్రి జగన్ అందరికీ షాక్ ఇచ్చారు
ఉత్తరాంధ్రా, కోస్తా, రాయలసీమ అభివృద్ధి ఏజెండాతో మూడు రాజధానులపై అసెంబ్లీలోనూ తీర్మానం చేయించారు. అప్పట్లో శాసనమండలిలో వైసీపీకి తగినంత బలం లేక ఆ తీర్మానం వీగిపోవడంతో.. జగన్ మండలిని రద్దు చేయడాదనికి కూడా సిద్దమయ్యారు. ఆ క్రమంలో అమరావతి రాజధానికి భూములు ఇచ్చిన రైతులు ఆందోళన బాట పట్టారు. జగన్ ప్రభుత్వం ఉద్యమాన్ని అణగదొక్కటానికి ఉక్కుపాదం మోపినా రైతుల ఆందోళన రోజురోజుకి ఉధృతమై.. మూడు రాజధానుల అంశం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చినీయంశమైంది. రైతుల ఆందోళన, న్యాయపరమైన చిక్కులతో వైసీపీ సర్కారు మూడు రాజధానుల విషయంలో ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోయింది.
ఆ దెబ్బతో 151 నుంచి 11 సీట్లకు వైసీపీ పడిపోవాల్సి వచ్చిందంది. ఒక విధంగా అమరావతిని టచ్ చేసి వైసీపీ భారీ రాజకీయ మూల్యం చెల్లించుకుందని అంటున్నారు విశ్లేషకులు. అయితే వైసీపీ ఓటమి చెందిన తరువాత అమరావతి మీద తన స్టాండ్ మార్చుకుంటుందనే అందరూ భావించారు. రాజధాని విషయంలో తమ స్టాండ్ ఎంటో పార్టీలో చర్చించుకుని నిర్ణయం తీసుకుంటామని శాసనమండలిలో ప్రతిపక్షనేత బొత్స సత్యనారాయణ ప్రకటించారు. బొత్స ప్రకటించిన తర్వాత పార్టీలో అంతర్గతంగా మూడు రాజధానుల విషయంలో వైసీపీ పునరాలోచించుకుంటుందని అందరూ భావించారు.
తీరా అమరావతి రాజధాని పున:నిర్మాణ పనులను ప్రధాని మోడీ ప్రారంభించడం…మూడేళ్ళలో అమరావతి రాజధాని పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించిన తర్వాత కూడా వైసీపీ నేతలు తీరు చూస్తే వారి విధానం మారలేదని స్పష్టమవుతోంది. అప్పులు తెచ్చి అమరావతి కోసం పెడితే మిగిలిన ప్రాంతాల సంగతేంటని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. అమరావతికి కృష్ణా నది ముంపు పొంచి ఉందని చెప్పుకొస్తున్నారు. వరద ఎఫైక్ట్ లేకపోతే…రాజధాని ప్రాంతంలో ఐదు ఎత్తిపోతల పధకాలని ఎందుకు నిర్మిస్తున్నారని వైసీపీ ప్రశ్నిస్తోంది. అమరావతి పేరిట నేతలు అవినీతికి పాల్పడుతున్నారనే ఆరోపణలు చేస్తున్నారు.
ఇలా వైసీపీ చేసిన ఆరోపణల్లో కొత్తేమీ లేదన్న టాక్ వినిపిస్తోంది. 2014 నుంచి 2019 మధ్యలో వైసీపీ నాయకులు చెప్పిన మాట్లాలనే తిరిగి మాట్లాడుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అమరావతి రాజధానికి వ్యతిరేకమని చాటుకున్న వైసీపీకి జనం గట్టిగానే బుద్ది చెప్పారు. అయినా ఆ పార్టీ సీనియర్లు, వైసీపీలో కొత్తగా చేరిన నాయకులు జగన్‌ని ప్రసన్నం చేసుకోవడానికి అన్నట్లు అమరావతిపై బురదజల్లే ప్రయత్నం చేస్తుండటం తీవ్ర విమర్శల పాలవుతోంది.
ఇంకోవైపు చూస్తే ఏపీకి రాజధాని ఒక సెంటిమెంట్‌గా మారింది. అమరావతి విషయంలో ఎవరేమి చెప్పినా జనాలు పట్టించుకునే మూడ్‌లో లేరని స్పష్టంగా కనిపిస్తోంది. అయినా వైసీపీ నేతలు చేస్తున్న దుష్ట్రచారంతో ఆ పార్టీకి రాజకీయంగా నష్టమే తప్ప మరేమీ ఉండదని అంటున్నారు. వైసీపీ ఎటూ బాహటంగా అమరావతికి మద్దతు ఇవ్వలేదు కాబట్టి సైలెంట్‌గా ఉన్నా బెటర్ అని ప్రజలు సెటైర్లు విసురుతున్నారు. చూడాలి మరి అమరావతి విషయంలో వైసీపీ స్టాండ్ ఇప్పటికైనా మారుతుందో? లేదో?