
సాగినంత కాలం నా అంత వాడు లేడంటారు..సాగక పోతే ఊరక చతికిలబడి పోతారు… ఇది కుప్పం నియోజకవర్గం విషయంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా అగ్ర నేతలకు సరిగ్గా సరిపోయే నానుడి.. కుప్పంలో వైసీపీ నేతలు అధికారంలో ఉన్నప్పుడు మామూలు హడావుడి చేయలేదు. చంద్రబాబు అడ్డుకున్నారు.. స్థానిక సంస్థల ఎన్నికల్లో సామదాన భేద దండోపాయాలు వాడారు.. కుప్పంలో పోడుస్తాము..చంద్రబాబును ఇంటికి పంపుతామన్న నేతలంతా చివరకు అధికారం కోల్పోయిన తర్వాత ఇంటికి పరిమితం అయ్యారు.. ఇక జిల్లా అగ్రనేతలు అయితే మాకేమి సంబంధం లేదంటున్నట్లు వ్యవహరిస్తుండటంతో.. కుప్పంలో వైసీపీ పరిస్థితి అనామకంగా తయారైందంట
కుప్పం నియోజకవర్గం అంటే చంద్రబాబునాయుడు .. బాబు అంటే కుప్పం ..ఆ విధంగా 40 సంవత్సరాల నుంచి ఆయన రాజకీయ, వ్యక్తిగత జీవితం పెన వేసుకు పోయింది. కుప్పంలో ప్రతి పల్లేలో కూడా అయన స్వంత మనుషులు ఉంటారు. వారిని పేరు పెట్టి పలకరిస్తారు. తాను చేపట్టబోయే అభివృద్ది కార్యక్రమాలను కూడా కుప్పంలో పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభించి తర్వాత రాష్ట్రమంతా అమలు చేయడం అనవాయితీ గా పెట్టుకున్నారు బాబు. గతంలో డ్రిప్ ఇరిగేషన్ ఇప్పుడు సోలార్ పవర్ వీటిన్నింటినీ చంద్రబాబు ప్రారంభించింది కుప్పంలోనే ..
అలాంటి కుప్పంలో మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబునాయుడుకి గత ఐదు సంవత్సరాలు చుక్కలు చూపించారు వైసీపీ నేతలు. ముఖ్యంగా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అయన కూమారుడు మిథున్ రెడ్డితో పాటు మాజీ ఎంపి రెడ్డప్పతో పాటు స్థానిక నేతలు ఆయనపై ఇష్టానుసారం నోరు పారేసుకున్నారు. ఒక వైసీపీ నాయకుడు అయితే ఏకంగా చంద్రబాబును బాంబులు పెట్టి లేపుతానని వార్నింగులు ఇచ్చారు. మాజీ ఎంపీ రెడ్డెప్ప అయితే తమ నాయకుడు పెద్దిరెడ్డిని విమర్శిస్తే అంతు చూస్తానంటూ బహిరంగ వేదికపై బూతులు తిట్టి కలకలం రేపాడు .ఇక మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి అదే పనిలో ఉండేవారు. డిప్యూటీ సీఎం హోదా కంటే ఎక్కువుగా చంద్రబాబును తిట్టే పనిలో ఉండేవారు. చంద్రబాబు కులాన్ని టార్గెట్ చేస్తూ చెలరేగిపోయేవారు. ఇక చోటా మోటా నేతలు కూడా కుప్పంలో చంద్రబాబుకి ఫ్యూచర్ లేదన్నట్లు మాట్లాడేవారు.
గతంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో స్థానిక ప్రజలతో పని లేకుండా ఎన్నికలు ఏలా నిర్వహించవచ్చో వైసీపీ నాయకులు చూపించారన్న ఆరోపణలున్నాయి. బయట ప్రాంతాల నుంచి ఓటర్లను బస్సులలో తెచ్చి ఓటింగ్ చేయించారు. మున్సిపల్ ఎన్నికలలో అయితే నామినేషన్ల తిరస్కరణ పేరుతో ఏకగ్రీవం చేసుకున్నారు. గెలుస్తారని భావించిన స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధుల గృహాలలో మద్యం ఉంచి కేసులు పెట్టించి జైళ్లలో ఉంచారు. వారివ్యాపారాలను దెబ్బతీసారు. ఇక కుప్పం సమీపంలోని గ్రానైట్ గనులలో అప్పటి వరకు ఉన్న కార్మిక లీజులను లాక్కుని ఇష్టానుసారం గ్రానైట్ తరలించారు. చివరకు చంద్రబాబు కేంద్ర పర్యావరణ శాఖ ద్వారా వాటిని ఆపించాల్సి వచ్చింది. అయనే ఏకంగా క్యారీలను పరిశీలించారు. ఏకంగా ద్రావిడ యూనివర్సిటి కాంపౌండు లో ఉన్న గ్రానైట్ కొండలను తవ్వారు.. స్థానికంగా ఉన్న వనరుల దోపిడీ జరిగింది. దీంతో పాటు కులాల వారీగా ఓటర్ల విభజనను తెచ్చే ప్రయత్నం చేశారు
మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుప్పం కేంద్రంగా నడిపిన రాజకీయం రాష్ట్రం మొత్తం సంచలనంగా మారింది. చిరకాల ప్రత్యర్థి చంద్రబాబును ఎలాగైనా ఓడించాలని అధికారాన్ని అడ్డం పెట్టుకుని పెద్దిరెడ్డి పన్నిన వ్యూహాలు ఇప్పటికీ చర్చల్లో నలుగుతూనే ఉంటాయి. పెద్దిరెడ్డి అండతో కుప్పం వైసీపీ నేతలు సైతం తమ్ముళ్లకు చుక్కలు చూపించి, పంచాయతీ ఎన్నికల నుండి మున్సిపల్ పోరు వరకు వైసీపీ జెండాను ఎగురవేసేలా చేసారు… చివరకు చంద్రబాబు కుప్పంలో అడుగుపెట్టడానికి కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడి రోడ్డు మీద కూర్చొని సొంత నియోజకవర్గంలోనే తొలిసారి ధర్నా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.. ఇక చంద్రబాబు వచ్చిన ప్రతిసారి రాళ్ల దాడులు, ఘర్షణలు కుప్పంలో కామన్‌గా మారాయి. అయితే గత ఎన్నికల్లో పెద్దిరెడ్డి రచించిన వ్యూహాలు బెడిసి కొట్టడంతో ఎప్పటిలాగానే కుప్పం ప్రజలు చంద్రబాబును ఎనిమిదో సారి ఎమ్మెల్యేగా గెలిపించారు. ఇక అక్కడ నుంచి కుప్పంలో పరిస్థితులు మారిపోయాయి. చాలా మంది స్థానిక వైసీపీ నేతలు నియోజకవర్గ నుంచి బెంగళూరుకు వలసపోయారు. పోతే మరి కొద్దిమంది సైలెంట్ అయ్యారు.
ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా మున్సిపల్ చైర్మన్ ఎన్నిక రెండు పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. కుప్పం మున్సిపాలిటీలో 25 వార్డులుండగా గత ఎన్నికలలో 18 వార్డులను గెలుచుకున్న వైసీపీ మున్సిపాలిటీ చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకుని చంద్రబాబుకు ఊహించని షాక్ ఇచ్చింది . 16వ వార్డు అభ్యర్థి అయిన డాక్టర్ సుధీర్ ను చైర్మన్ చేసింది. టీడీపీ కేవలం 6 వార్డులతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయితే గతేడాది నవంబరు 6వ తేదీన జరిగిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో చైర్మన్ పదవితోపాటు, కౌన్సిలర్ పదవికి కూడా సుధీర్ రాజీనామా చేశారు. దాంతో తిరిగి కుప్పం కౌన్సిల్లో చైర్మన్ ఎన్నిక జరిగింది
పార్టీ మారిన వైసీపీ కౌన్సిలర్లతో కలిపి టీడీపీకి అనుకూంలంగా 14 మంది ఓటు వేశారు. దానికి ఎమ్మెల్సీ ఓటు కూడా తోడవడంతో టీడీపీ బలపరిచిన అభ్యర్థికి అనుకూలంగా 15 ఓట్లు నమోదయ్యాయి. వైసీపీ నుంచి కేవలం 8 మంది కౌన్సిలర్లు మాత్రమే ఎన్నికకు హాజరయ్యారు. దాంతో టిడిపి సునాయాసంగా ఎన్నికలలో విజయం సాధించింది. కౌన్సిలర్‌గా ప్రాతినిధ్యం వహిస్తున్న వన్నియకుల క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన సెల్వరాజును కుప్పం మున్సిపల్ చైర్మన్‌గా ఎన్నుకున్నట్లు అధికారులు ప్రకటించారు. అయితే ఎన్నిక ముందు వరకు సై అంటే సై అన్న వైసీపీ నేతలు….చివరికి వచ్చే సరికి చేతులెత్తేయడంతో నవ్వులపాలయ్యారు. నలుగురు కౌన్సిలర్లు అయితే చివరి నిమిషంలో వైసిపికి షాక్ ఇచ్చి టిడిపి జై కొట్టారు.
ఇంత రచ్చ జరుగుతుంటే కుప్పంలో చంద్రబాబును ఓడిస్తానని సవాల్ చేసిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాత్రం కుప్పం మున్సిపల్ చైర్మన్ ఎన్నిక విషయంలో నాకెందుకు లే అన్నట్లు వ్యవహరించడం చర్చనీయాంశంగా మారింది. అధికారంలో ఉన్నప్పుడు కుప్పంలో ఎమ్మెల్యేగా చంద్రబాబుని ఓడిస్తామని బీరాలు పలికిన పెద్దిరెడ్డి తర్వాత మాత్రం అసలు కుప్పం సెగ్మెంట్‌ని పట్టించుకోకపోవడంపై స్థానిక కేడర్ గుర్రుగా ఉంది. మిమ్మల్ని నమ్ముకుని మేము రాజకీయం చేస్తే ఇప్పుడు నాకేం సంబంధం లేదు అన్నట్లుగా ఉండిపోవడం ఎంతవరకు కరెక్ట్ అంటూ కుప్పం నేతలు గట్టిగానే ఆయన అనుచరులను ప్రశ్నిస్తున్నారట. ఇక టిడిపి నేతలు అయితే మరో అడుగు ముందు చేసి పెద్దిరెడ్డిని బహిరంగంగానే టార్గెట్ చేస్తున్నారు.
అధికారంలో ఉన్నప్పుడు పుంగనూరు కంటే కుప్పంలోనే ఎక్కువగా తిరిగిన పెద్దిరెడ్డి ఇప్పుడు ఈ పక్కకు రావడానికి భయపడుతున్నారని తెలుగు తమ్ముళ్లు యద్దేవా చేస్తున్నారు. పెద్దిరెడ్డికి కేసుల భయం పట్టుకుందని అందుకే కుప్పం వైపు చూడడం లేదంటూ బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. అయితే కొద్ది మంది సీనియర్ నేతలు మాత్రం పెద్దిరెడ్డి కుప్పం మున్సిపల్ చైర్మన్ ఎన్నిక సమయంలో బయటకి రాకపోయినా …మొత్తం వ్యవహారం గమనించారని, పార్టీకి ద్రోహం చేస్తూ వెళ్లిపోయిన వారిని వెంటనే చేయించింది పెద్దిరెడ్డే అని చెప్పుకొస్తున్నారు… ఎవరి మాటలు ఎలా ఉన్నా కుప్పం వైసిపి క్యాడర్ మాత్రం మా పెద్దాయన ఎక్కడ అంటూ గట్టిగానే నిలదీస్తున్నారట… మరి చూడాలి పెద్దిరెడ్డి మళ్లీ కుప్పం రాజకీయాల్లో వేలు పెడతారో లేదో?