కేశినేని సోదరుల యుద్ధం…

రాజకీయాల్లో అన్నదమ్ముళ్లంటే ఆ లెక్కే వేరు అని నిరూపిస్తున్నారు విజయవాడ కేశినేని బ్రదర్స్. అన్నకు పోటీగా అదే నియోజవర్గంలో రాజకీయంగా ఎదిగి.. ఎంపీగా ఎన్నికైన తమ్ముడు ఒకవైపు.. తమ్ముడి కొట్టిన దెబ్బను తట్టుకోలేక రాజకీయాల నుంచే తప్పుకున్న అన్న మరోవైపు. ఇప్పుడు ఇద్దరికీ.. ఒకరంటే ఒకరు పడట్లేదు. అవినీతి ఆరోపణలతో అన్న ఇబ్బంది పెడుతుంటే.. పరువు నష్టం దావాలతో తమ్ముడు పొలిటికల్ గేమ్ మొదలుపెట్టాడు. అసలు.. బెజవాడ బ్రదర్స్ మధ్య ఈ రచ్చేంటి?

విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని, ప్రస్తుత ఎంపీ కేశినేని చిన్ని మధ్య తలెత్తిన రాజకీయ, వ్యాపార, వ్యక్తిగత విభేదాలు.. ఏపీ మొత్తం హాట్ టాపిక్‌గా మారాయ్. వాటితోనే.. అన్నదమ్ముళ్లిద్దరూ అప్రతిష్ట పాలవుతున్నారనే చర్చ జనంలో మొదలైంది. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్‌పై.. మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయిన ఆయన సోదరుడు కేశినేని నాని.. ఓ రేంజ్‌లో అవినీతి ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఎంపీగా గెలిచిన కేశినేని చిన్ని అవినీతికి అంతులేకుండా పోతోందని.. ఆయన అనేక అక్రమ వ్యాపారాలు నిర్వహిస్తున్నారని.. మనీలాండరింగ్, లిక్కర్ కేసుల్లో అరెస్ట్ అయిన వారితో సంబంధాలున్నాయని ఆరోపిస్తున్నారు. కేవలం ఆరోపణలే కాదు.. దీనిపై ప్రధాని మోడీ, కేంద్రహోంమంత్రి అమిత్ షా, ముఖ్యమంత్రి చంద్రబాబు, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి కూడా ఫిర్యాదు చేస్తున్నారు.

అన్నదమ్ముళ్లైన వీరి మధ్య రాజకీయ పోరు చూసి జనం ఆశ్చర్యపోతున్నారు. వీళ్లు నిజంగా అన్నదమ్ముళ్లేనా? ఆగర్భశత్రువులా? అని చర్చించుకుంటున్నారు. వాస్తవానికి.. మొన్నటి ఎన్నికల వరకు వీళ్లిద్దరి మధ్య సఖ్యత ఎలా ఉండేదో.. ఎవ్వరికీ తెలియదు. అప్పట్లో.. తెలుగుదేశం ఎంపీగా ఉన్న కేశినేని నాని.. టీడీపీని వీడి.. వైసీపీలో చేరడం.. ఆయనకు ప్రత్యర్థిగా తమ్ముడు కేశినేని నివనాథ్ అలియాస్ చిన్ని పోటీ చేయడం.. రికార్డు స్థాయి మెజారిటీతో గెలవడం.. ఇలా అన్నీ వరుసపెట్టి జరిగిపోయాయ్. ఎన్నికల తర్వాత వైసీపీలో ఉన్న కేశినేని నాని.. తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని.. ఇకపై ఏ పార్టీలో చేరబోనని ప్రకటించారు. అయితే.. ఆయన పాలిటిక్స్ నుంచి వైదొలగుతున్నట్లు ప్రకటించిన తర్వాత కూడా.. విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని మీద వరుసగా అవినీతి ఆరోపణలు చేస్తూ రావడం.. ఆంధ్రా రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

ముందుగా ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు.. 60 ఎకరాల ప్రభుత్వ భూమి కట్టబెట్టేందుకు ఎంపీ చిన్ని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు నాని. ఈ సంస్థను చిన్ని బినామీ నడుపుతున్నట్లుగా విమర్శించారు. భూ కేటాయింపులను రద్దు చేయాలని.. ట్విట్టర్‌లో సీఎం చంద్రబాబుకు కూడా ఫిర్యాదు చేశారు. దీనిని వైసీపీ రచ్చ రచ్చ చేసింది. ఎకరం భూమి కేవలం 99 పైసలకే ఇచ్చారని.. అందులో వేల కోట్ల అవినీతి జరిగిందని.. ఇందుకు కేశినేని చిన్నినే కారణమని విమర్శలు గుప్పించింది. దాంతో.. ఎంపీ కేశినేని చిన్ని.. తన సోదరుడు నానిపై వంద కోట్లకు పరువునష్టం దావా వేశారు. ఇలాంటి వాటికి తాను బెదరనని చెబుతూ.. మద్యం స్కామ్‌లో అరెస్ట్ అయిన కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డితోనూ.. కేశినేని చిన్నికి సంబంధాలున్నాయని ఆరోపించారు కేశినేని నాని. ఇది.. రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారితీసింది.

అసలు ఎందుకు నాని.. సొంత తమ్ముడిని వీధిలోకి లాగుతున్నారు? ఇదంతా.. అవినీతిని సహించలేని తత్వమా? నిజంగానే సమాజానికి మేలు చేయాలనా? లేక తనని రాజకీయంగా దెబ్బతీసిన సోదరుడిని.. తాను కూడా అదేవిధంగా దెబ్బతీసి.. మళ్లీ రాజకీయంగా బలపడాలనే ఎత్తుగడా? అనే ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో తలెత్తుతున్నాయ్. అయితే.. అవినీతిపై కేశినేని నానికి మాట్లాడే అర్హత లేదని.. ఆయన జగన్ పంచన చేరినప్పుడే.. అవినీతి గురించి మాట్లాడే అర్హత కోల్పోయారని టీడీపీ నేతలు అంటున్నారు. అయితే.. అన్నయ్య నాని ఇలా తమ్ముడి చిన్ని అంతు చూసేందుకు ప్రధాన కారణం.. తమ్ముడు రాజకీయంగా ఎదుగుతున్నారనే దుగ్ధేననే టాక్ విజయవాడ పొలిటికల్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. అంతకుముందు వీళ్లిద్దరి మధ్య సంబంధాలు ఎలా ఉన్నాయో తెలియదు గానీ.. మొన్నటి ఎన్నికల ముందు మాత్రం బాగా దెబ్బతిన్నాయ్. కేశినేని శివనాథ్.. విజయవాడ ఎంపీ సీటు అడిగిన తర్వాతే.. వీళ్లిద్దరి మధ్య బంధానికి బీటలు వారిందనే అభిప్రాయాలున్నాయ్.

ఎంపీ కేశినేని నాని.. తనను ఓ పద్ధతి ప్రకారమే.. టీడీపీ నుంచి బయటకు పంపించి.. విజయవాడ సీటుని తమ్ముడు చిన్ని కొట్టేశారనే అభిప్రాయంలో ఉన్నారని ఆయన అనుచరులు చెప్పుకుంటూ ఉంటారు. ఇందుకు కారణమైన తన తమ్ముడిపై అవినీతి ఆరోపణలతో.. పలుచన చేయాలనే వ్యూహాంతోనే.. నాని ఇలా తమ్ముడి పరువు, ప్రతిష్ఠలకు భంగం వాటిల్లేలా చేస్తున్నారనే చర్చ జరుగుతోంది. అందుకోసమే.. ముందుగా వైసీపీ నుంచి బయటకొచ్చేశారట. ఆ పార్టీలోనే ఉండి ఆరోపణలు చేస్తే.. అవి అంతగా జనంలోకి వెళ్లవనే లెక్కలేసుకొని.. ఏ పార్టీతో సంబంధం లేదంటూనే.. తమ్ముడిని రచ్చకు ఈడ్చే ప్రయత్నాల్లో ఉన్నారనే చర్చ జరుగుతోంది. ఏదోరకంగా.. తమ్ముడిని రాజకీయంగా దెబ్బతీయాలనే లక్ష్యంగా.. కేశినేని నాని ప్రయత్నిస్తున్నారనే వాదనలు ఉన్నాయి. మరి.. అన్న ఆరోపణల్ని.. తమ్ముడు కేశినేని చిన్ని ఎలా ఎదుర్కొంటారు.. ఏ విధంగా కౌంటర్ చేస్తారనేది ఆసక్తిగా మారింది.