కావలి మాజీ ఎమ్మెల్యేకి ఉచ్చు..

నెల్లూరు జిల్లా కావలిలో అమృత్ పథకం పైలాన్ కూల్చివేత కేసు కీలక మలుపు తిరుగుతోంది. వైసీసీ మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి ఈ కేసులో ఐదో నిందితుడిగా ఉండటంతో రాజకీయంగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. 2018లో నారా లోకేష్ చేతుల మీదుగా ఆవిష్కరించిన ఈ పైలాన్‌ను 2020లో అర్ధరాత్రి కూల్చివేసి మందాడి చెరువులో పడేసారు. అప్పుడు ఆ ఘటన పట్టణంలో పెద్ద దుమారమే రేపింది. ఆనాడు ప్రతిపక్ష పార్టీ నేతలు నిరసనలు తెలిపినా పట్టించుకున్న నాధుడే లేడు. అయితే ఇప్పుడు ఈ కేసు తెర మీదకు వచ్చింది. పైలాన్ ధ్వంసం కేసులో మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి తో పాటు మరో 11 మందిని నిందితులుగా పోలీసులు ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు. దీంతో ఆ నియోజకవర్గంలో రాజకీయాలు ఒక్కసారిగా హీట్ ఎక్కాయి.

నెల్లూరు జిల్లా కావలిలో అమృత పైలాన్ ధ్వంసం కేసులో నలుగురు విలేకరులను కావలి టూ టౌన్ పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరు పరచగా, న్యాయమూర్తి వారికి 12 రోజులు రిమాండ్ విధించారు. పోలీసులు ఈ నెల 4న ఆదివారం రాత్రి వారిని కావలి సబ్ జైలుకు తరలించారు . మిగతా వారికోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ కేసులో మొత్తం 12 మందిని నిందితులుగా పోలీసులు చేర్చారు. ఈ కేసులో కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డితో పాటు మాజీ ఏఎంసీ చైర్మన్ మన్నెమాల సుకుమార్‌రెడ్డి, వైసీపీ పట్టణ అధ్యక్షుడు కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి, వైసిపి రాష్ట్ర నాయకులు కేతిరెడ్డి జగదీశ్ రెడ్డి, చెన్ను ప్రసాద్ రెడ్డిలను నిందితులుగా పోలీసులు ఎఫ్ఐఆర్‌లో నమోదు చేశారు.

2018లో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్య నిధులతో కావలి పట్టణ వాసులకు ఇంటింటికి మంచినీరు అందించే అమృత పథకాన్ని ప్రారంభించారు. అందులో భాగంగా 80 కోట్ల రూపాయల అభివృద్ధి పథకాలకు సంబంధించిన పైలాన్ శిలాఫలకాన్ని 2018లో జనవరి 8న మంత్రి నారా లోకేష్ చేతుల మీదగా అప్పటి మంత్రి నారాయణ, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, బీద సోదరులు ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. అయితే వైసిపి ప్రభుత్వం వచ్చాక 2020 ఏప్రిల్ 11న అమృత శిలాఫలకాన్ని గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేసినట్లు అప్పటి మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు ఫిర్యాదు చేశారు. ఆ మేరకు కావలి రెండో పట్టణ పోలీస్ స్టేషన్‌లో పోలీసులు కేసు నమోదు చేశారు.

పైలాన్ కూలగొట్టిన స్థలంలో మరుసటి రోజు ప్రెస్ క్లబ్ నిర్మిస్తున్నట్లు భూమి పూజకు ప్రముఖులను ఆహ్వానిస్తూ ఒక ఫ్లెక్సీ ను కూడా ఏర్పాటు చేశారు. ఆ ఫ్లెక్సీలో అప్పటి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ మన్నెమాల సుకుమార్ రెడ్డి, అప్పటి జిల్లా కలెక్టర్ శేషగిరిరావు, జాయింట్ కలెక్టర్ శ్రీధర్, డిఎస్పీ దేవరకొండ ప్రసాద్, కమిషనర్ వెంకటేశ్వర్లు, తాహసీల్ధార్ రామకృష్ణ ఫోటోలు ముద్రించారు. ప్లెక్సీలో అధికారుల ఫోటోలు ఉండటం అప్పట్లో కలకలం రేపింది. అలాంటి వివాదాస్పద స్ధలంలో భూమి పూజకు ఆహ్వానం పలికిన వారిపై అధికారులు చర్యలు తీసుకోలేదు.

ఆ పైలాన్ ధ్వంసంపై టీడీపీ నేతలు ప్రెస్ మీట్‌లు పెట్టి ఘోషించినా అధికారులలో ఉలుకు, పలుకు లేకుండా పోయింది. పైలాన్ ధ్వంసం చేసిన ప్రాంతంలో సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ, పోలీసులు ఎందుకు మౌనంగా ఉన్నారో కూడా తెలియటం లేదని అప్పట్లో తెలుగుదేశం, బిజెపి, వామపక్ష పార్టీ నేతలు కూడా విమర్శలు గుప్పించారు. ప్రజాప్రయోజనాల కోసం ఉద్దేశించిన పైలాన్ ధ్వంసంపై విపక్షాలు ఆందోళనలు నిర్వహించి, చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసినా అప్పటి అధికారులు వైసీపీపై స్వామిభక్తితో పట్టించుకోలేదు.

కూటమి ప్రభుత్వం వచ్చి పది నెలలు గడిచాక ఎట్టకేలకు పైలాన్ ధ్వంసం కేసు తెర మీదకు వచ్చింది. పైలాన్ ధ్వంసం కేసులో మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి, విలేకర్లు, వైసీపీ నాయకులు ఉన్నట్లు పోలీసులు కేసు నమోదు చేసి కొందరిని రిమాండ్ కు తరలించారు. మిగతా వారికోసం గాలిస్తున్నట్లు తెలుపుతున్నారు. మరి ఆ నాడు సీసీ కెమేరాలలో పైలాన్ ధ్వంసం చేసిన వారి ఫుటేజ్ ఉందా, లేదా?..ఉంటే అప్పటి పోలీస్ అధికారులు ఎందుకు మౌనం వహించారు? రాజకీయ ఒత్తిళ్లుకు తలొగ్గారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఆ కేసు విచారణ చేపట్టిన అధికారులు నిష్పక్షపాతంగా చర్యలు తీసుకోవాలని, లేకపోతే విమర్శలు మూడుగట్టుకోవాల్సి వస్తుందంటున్నారు.

అయితే రాజకీయ కక్ష సాధింపులలో భాగంగానే తమపై అక్రమ కేసులు బనాయించారని మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి ఆరోపిస్తున్నారు. తన కోసం మనుషులను పంపించాల్సిన అవసరం లేదని జిల్లా ఎస్పీ, డిఎస్పీ ఫోన్ చేసి అరెస్ట్ చేస్తామంటే.. లొంగిపోవడానికి సిద్దంగా ఉన్నట్లు ఆయన కొన్ని మీడియాల్లో స్టేట్‌మెంట్లు ఇస్తున్నారు. తనను అరెస్ట్ చేసేటప్పుడు కావలిలో పార్టీ కార్యకర్తలు వేల మంది వచ్చే పరిస్థితి కూడా ఉందని హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. టీడీపీ మాత్రం అప్పటి కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు చొరవతో కేంద్ర నిధులతో కావలిలో పైలాన్ ను ఏర్పాటు చేసి, ఆ పైలాన్ ను మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా ప్రారంభిస్తే ధ్వంసం చేశారని మండిపడుతోంది.

యువగళం పాదయాత్రలోనే లోకేష్ కావలిలో హామీ ఇచ్చారు. పైలాన్ ధ్వంసం చేసిన వారిని వదిలేది లేదని , ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తే చూస్తూ ఊరుకోరని, చట్టం తనపని తాను చేసుకుని పోతుందని లోకేష్ హెచ్చరించారు. మరో పక్క వైసీపీ నేతలు గతంలో చేసిన అరాచకాలు ఒకటి రెండు కావని, గతంలో విలేకరుల పై కేసులు పెట్టి దాడులు చేసిన సంసృతి మీది కాదా?.. టిడిపి నేతలపై అట్రాసిటీ కేసులు, రౌడీషీట్ లు ఓపెన్ చేయించి ఇసుక, గ్రావెల్, రేషన్ మాఫియా నడిపింది మీరు కాదా అని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇలా కావలి నియోజకవర్గం లో అధికార, ప్రతిపక్ష పార్టీ నేతలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. మొత్తమ్మీద కావలి వైసీపీ మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి మెడకు పైలాన్ ధ్వంసం కేసు ఉచ్చు బిగుసుకుంటున్నట్లే కనిపిస్తోంది. పోలీసులు ఈ కేసును ఏ విధంగా ముందుకు తీసుకువెళ్తారో అని కావలి వాసులతోపాటు జిల్లా ప్రజలు కూడా ఉత్కంఠ నెలకొంది.