తిరుమల నెయ్యి ఛార్జ్ షీట్ …

తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవారి ప్రసాదాలకు వినియోగించిన కల్లీ నెయ్యికేసు విచారణలో మొదటి చార్జ్‌షీట్‌ను రెండు మూడు రోజులలో సెంట్రల్ సిట్ అధికారులు నెల్లూరు ఏసీబీ కోర్టులో దాఖలు చేయనున్నారు . ఆ చార్జ్‌షీట్‌లో బుక్ అయ్యే నిందితులు ఎవరు? తర్వాత దశ విచారణలో ఎవరి మీద కత్తి వేలాడుతోంది?..10 మంది టీటీడీ ఉద్యోగులు, గత పాలకవర్గంతో పాటు గతంలో పనిచేసిన టీటీడీ ఉన్నతాధికారులు కూడా ఆ అపచారంలో కీలక పాత్ర పోషించారని జరుగుతున్న ప్రచారంలో నిజమెంత? .. అసలు సిట్ ఎవ్వరిపై దృష్టి సారించింది?

తిరుమల శ్రీవారి నైవేద్యాలతో పాటు లడ్డూ ప్రసాదాలకు కల్తీ నెయ్యి వినియోగించారన్న ఆరోపణలు అంతర్జాతీయంగా ఉన్న హిందు సమాజాన్ని ఉలికిపాటుకు గురిచేశాయి. కల్తీ జరిగిందని టీటీడీ ప్రస్తుత ఈఓ శ్యామలరావు తెలపగా, జంతు సంబంధిత పదార్థాలతో కల్తీ జరిగిందని ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కూటమి శాసనసభ్యుల సమావేశంలో ప్రకటించి కలకలం రేపారు. తర్వాత ఆ కల్తీ వ్యవహారంపై విచారణకు రాష్ట ప్రభుత్వం సిట్ బృందాన్ని ఏర్పాటు చేసింది. దానిపై వైపీపీ ప్రభుత్వ హయాంలో తొలి దశలో టీటీడీ చైర్మన్‌గా పనిచేసిన వైవీ సుబ్బారెడ్డితో పాటు ఉత్తరాదికి చెందిన ఓ ఎడిటర్, తమిళనాడుకు చెందిన రాజ్యసభ మాజీ సభ్యుడు సుబ్రమణ్యస్వామి లాంటి వారంతా సుప్రీం కోర్టులో కేసు వేశారు.

హిందువుల మనోభావాలకు సంబంధించిన సున్నితమైన అంశం కావడంతో సుప్రీంకోర్టు తక్షణ స్పందించి వారి పిటీషన్లపై విచారణ జరిపింది. సీబీఐతో పాటు ఏపీ ప్రభుత్వానికి చెందిన పోలీస్ అధికారులు, అదేవిధంగా మైసూరుకు చెందిన పుడ్ సెప్టీ అండ్ సెక్యూరిటీకి సంబంధించిన ల్యాబ్ నుంచి ఒకరితో సెంట్రల్ సిట్‌ను ఏర్పాటు చేసి కల్తీ వ్యవహారంపై విచారణకు ఆదేశించింది. అయితే అప్పటికే రాష్ట ప్రభుత్వం సిట్ దర్యాప్తు చాలావరకు పూర్తి చేసిన నేపథ్యంలో… గతంలో సిట్ లో ఉన్న అధికారులనే ఏపీ ప్రభుత్వం కేంద్ర సిట్ దర్యాప్తులో కొనసాగించింది. ఆ సిట్ బృందం తిరుపతిలో కార్యాలయం ఏర్పాటు చేసుకుని విచారణ ముమ్మరం చేసింది

సిట్ దర్యాప్తులో బోలే బాబా డెయిరీ , వైష్ణవి డెయిరీలు తమిళనాడులో ఏఆర్ డెయిరీ కాంట్రాక్టును అడ్డం పెట్టుకుని ఉత్తరాది నుంచి నెయ్యిని తెచ్చి టీటీడీకి సరఫరా చేశారని తేలింది. అందుకు గాను ఏఆర్ డెయిరీ యాజమాన్యానికి కమీషన్ ఇచ్చినట్లు తెలుస్తుంది. నెయ్యి సరఫరాకు బోలేబాబా డెయిరీకి చెందిన ప్రతినిధులు నాయుడు పేట సమీపంలో ఉన్న వైష్టవి డెయిరీని కొనుగోలు చేసారని తెలుస్తోంది. అయితే అప్పటికే వైష్ణవి డెయిరీ నెయ్యి సరఫరా టెండర్లలో పాల్గొని టీటీడీ అవసరాలకు సరిపడా సరఫరా చేయలేక చేతులెత్తేసింది. ఈ నేపథ్యంలో వారు తక్కువ ధరకు నెయ్యిని ఏఆర్ డెయిరీకి అమ్మినట్లు రికార్డులు సృష్టించి అక్కడ నుంచి సరఫరా చేసినట్లు సెట్ విచారణలో తేలిందంట.

దానికి సంబంధించి సిట్ అధికారులు ఇప్పటి వరకు అరుగురిని అరెస్ట్ చేశారు. ఏఆర్ డెయిరీ ఎండి రాజశేఖరన్‌తో పాటు బోలే బాబా డెయిరీ డైరెక్టర్లు విపిల్ జైన్, పోమిల్ జైన్, వైష్ణవి డెయిరీ సీఈఓ అపూర్వ చావడాలను అదుపులోకి తీసుకున్నారు. తర్వాత టీటీడీ ప్రొక్యూర్‌మెంట్ ఉద్యోగులు శేఖర్ , నాగేంద్రల విచారణ తర్వాత మరో ఇద్దరిని అరెస్ట్ చేసారు. బోలేబాబా డెయిరీ సీజీఎం హారి మోహన్, బోలేబాబా డెయిరీకి సరుకులు సరఫరా చేసే వ్యాపారి ఆశిష్ అగర్వాల్‌ను అరెస్ట్ చేసి ఐదు రోజుల పాటు సిట్ కస్టడీకి తీసుకుని విచారించారు.

ఆ క్రమంలో సిట్ అధికారులు వ్యూహాత్మకంగా పావులు కదపడం మొదలుపెట్టారు. లంచాలు తీసుకుని కల్తీ నెయ్యి ట్యాంకర్లను అనుమతించామని అంగీకరించిన టీటీడీ ప్రొక్యూర్‌మెంట్ ఉద్యోగులను సాక్షులుగా మార్చి ప్రస్తుతం మొదటి దశ చార్జ్‌షీట్ దాఖలు చేయనున్నారు. కేసును కూడా తిరుపతి కోర్టు నుంచి సిట్ నెల్లూరు ఏసీబీ కోర్టుకు మార్చుకుంది. ముఖ్యంగా అవినీతి జరిగి అక్కడ కల్తీకి పాల్పడ్డారనే ఆరోపణలతో కేసును ఏసీబీ కోర్టుకు మార్చారు. దాంతో భవిష్యత్తులో టీటీడీలో ఉన్నతోద్యోగులు గా పనిచేసిన వారిని సైతం కేసులో నిందితులుగా మారుస్తారనే ప్రచారం జరుగుతుంది.

ముఖ్యంగా డెయిరీల సామార్థ్యంతో పాటు మార్కెట్ ధర కంటే తక్కువ ధరకు ఏ విధంగా నాణ్యమైన సరుకు సప్లయి చేస్తారనే విషయం గురించి అలోచించకుండా నెయ్యి సరఫరాలకు అనుమతిచ్చిన కీలక వ్యక్తుల మెడకు ఉచ్చు బిగుసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. రివర్స్ టెండరింగ్ పద్దతిలో అడ్డగోలుగా నిర్ణయాలు తీసుకుని, పవిత్రమైన శ్రీవారి ప్రసాదాల నాణ్యత గురించి అలోచించకుండా అప్పటి పాలకవర్గాలు ఆలయ పవిత్రతను, భక్తుల మనోభావాలను దెబ్బతీశాయని ప్రస్తుత పాలక వర్గం సభ్యులతో పాటు అధికారులు అంటున్నారు.

ప్రస్తుతం 2024 జూన్ నెలలో కల్తీ చేసిన నెయ్యి ట్యాంకర్ల భాగోతం బయటపడింది. అంతకు మునుపు నెయ్యి టెండర్ల విషయంలో జరిగిన వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే విజిలెన్స్ నివేదికతో రెడీగా ఉంది. టీటీడీలోని అక్రమాలపై విజిలెన్స్ ప్రాథమిక నివేదిక ఇచ్చిన తర్వాత అసలు వాస్తావాలు బయటపడుతున్నాయంటున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికి ఆరుగురు అరెస్ట్ కాగా, మొదటి చార్జ్‌షీట్‌లో ఉన్న నిందితులు కొంతమంది ఇంకా పరారీలో ఉన్నారు. అయినప్పటికి మొదటి చార్జ్‌షీట్‌ దాఖలు చేయడం ద్వారా ప్రస్తుతం రిమాండ్ లో ఉన్న వారికి బెయిల్ రాకుండా చేయడానికి సిట్ ప్లాన్ చేసిందంట. మలి దశలో మరికొన్ని అరెస్టులు ఉంటాయని , అందులో నేతలు , టీటీడీ ఉద్యోగులు ఖచ్చితంగా ఉంటారని అంటున్నారు. మరి చూడాలి సెట్ విచారణలో మున్ముందు బుక్ అయ్యేదెవరో?