పుష్ప టూ ఫాలో అవుతున్నారా?

శేషాచలం అడవుల్లో పట్టుబడిన 25 వేల కోట్ల రూపాయల ఎర్రచందనం గోడౌన్లలో మగ్గిపోతోంది. ఆ నిల్వలను విక్రయించడానికి ప్రభుత్వం టెండర్లు పిలుస్తుంటే స్మగ్లర్లు తెలివిగా వాటిని అడ్డుకుంటున్నారంట. హనీ ట్రాప్‌తో అధికారులకు వల వేస్తూ.. ఇన్ ఫార్మర్ల పేరుతో అధికారులకు కుచ్చుటోపి పెడుతూ రెడ్ శాండిల్ స్మగ్లింగ్ యథాతధంగా కానిస్తున్నారంట. కొందరు అధికారుల ఉదాసీనతతో వారి కార్యకలాపాలు కొనసాగుతూనే ఉండటం విమర్శల పాలవుతోంది.

ఆంధ్రప్రదేశ్లోని శేషాచలం అడవులలో మాత్రమే లభించే అరుదైన బంగారం లాంటి సంపద ఎర్రచందనం. ఈ ఎర్రచందనం స్మగ్లింగ్ అరికట్టడానికి గతంలో ఎన్నో చర్యలు తీసుకున్నప్పటికీ, స్మగ్లర్లను అడ్డుకునేందుకు వెళ్లిన అటవీ సిబ్బంది సైతం ప్రాణాలు పోగొట్టుకున్నప్పటికీ, రాజకీయ రాబందుల ముందు అధికారుల నిజాయితీ నీరుగారిపోయింది. గత వైసిపి ప్రభుత్వం లో అయితే ఏకంగా మంత్రి స్థాయిలోని పెద్దలే ఎర్రచందనాన్ని చక్కగా ఎల్లలు దాటించారన్న ఆరోపణలున్నాయి. సదరు మంత్రి అనుచరులే ఉన్నతాధికారులకు రకరకాల అడ్డంకులు సృష్టించి, వారి దృష్టి మరల్చడానికి ఉన్నతాధికారులనే హనీ ట్రాప్ లో పెట్టేసారు. ఈ పరిస్థితి నుంచి బయటపడడానికి ఉన్నతాధికారులకే తల ప్రాణం తోకకు వచ్చిందంట.

ప్రభుత్వం కూడా ఉన్నతాధికారుల నిజాయితీనే శంకించే విధంగా మాయలో పెట్టేసిన స్మగ్లర్లు …తమ స్మగ్లింగ్ దందాని సాఫీగా జరిగేలా చేసుకున్నారు. ఇక చివరికి ఎంత నిజాయితీగా పనిచేసినా… ప్రభుత్వం వైపు నుండి సరైన సపోర్టు.. భద్రత లేని పరిస్థితుల్లో ఉన్నతాధికారులు స్థానికంగా ఉన్న పరిస్థితులకు అనుగుణంగా మారిపోయారు. స్మగ్లర్లను పట్టుకోవడానికి వాళ్లలోనే ఉన్న స్మగ్లర్లను ఇన్ ఫార్మర్లుగా మార్చుకొని బండి లాగించే పనిలో పడ్డారు. దీంతో స్మగ్లర్ల పని కూడా మరింత సులువుగా తయారయింది. అధికారుల దృష్టిలో తాము ఇన్ ఫార్మర్లమని చెప్పుకుంటూ స్మగ్లర్ల వైపు నుండి తమకు కావలసిన సరుకుని ఎల్లలు దాటిస్తూ, 10 లారీలు బయటకు వెళితే ఒక లారీని ఉన్నతాధికారులకు పట్టిస్తూ, తెలివిగా తమ దందాని నడిపిస్తున్నారంట.

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ప్రస్తుతం ప్రధానమైన ఎర్రచందనం స్మగ్లర్లు లో నలుగురు పేర్లు ప్రముఖంగా వినపడుతున్నాయి. వైసిపి తో అంట కాగుతున్న స్మగ్లర్లే ఎర్రచందనాన్ని ఎల్లలు దాటిస్తున్నారని అధికారుల వద్ద ఉన్న సమాచారం. 2019కి మునుపు అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం కూడా ఎర్రచందనం స్మగ్లింగ్ అడ్డుకట్ట వేయడానికి ఎన్నో కఠినమైన చర్యలు తీసుకుంది. అటు తరువాత వైసిపి ప్రభుత్వం దీన్ని పూర్తిగా నీరుగార్చింది. మళ్లీ ఇప్పుడు పరిస్థితి యథా విధంగా కొనసాగుతోంది. ఓ రకంగా చెప్పాలంటే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రం పెద్దలతో కూడా సత్స సంబంధాలు పెంచుకొని స్మగ్లర్లు ఓరకంగా సమాంతర మాఫియాను నడుపుతున్నారు. అధికార వ్యవస్థ కూడా ఈ మాఫియా సామ్రాజ్యాన్ని చూసి ధైర్యంగా ముందడుగు వేయలేని పరిస్థితిలో ఉందంట.

రాష్ట్ర ప్రభుత్వానికి వేల కోట్ల రూపాయలు ఆదాయం చేకూరే అవకాశం ఉన్న ఎర్రచందనం టెండర్ల ప్రక్రియను స్మగ్లర్లు తెలివిగా అడ్డుకుంటున్నారు. అసలు ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్లో ఎర్రచందనానికి డిమాండే లేదని తప్పుడు ప్రచారం చేస్తూ, టెండర్లు పిలిస్తే ఎవరు పాల్గొనకుండా అంతర్గతంగా అందరినీ నిరోధించి, అసలు డిమాండ్ లేదని ప్రభుత్వం నమ్మేలాగా పరిస్థితిని సృష్టిస్తున్నారు. ఈ పరిస్థితిని అధిగమించాలంటే ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికతో ముందడుగు వేయాల్సి ఉందంటున్నారు.

ఆంధ్ర ప్రదేశ్ లో వేల టన్నుల ఎర్రచందనం నిల్వలు ప్రభుత్వ గోడౌన్లలో మగ్గిపోతున్నాయి. అమ్మితే వేల కోట్ల సంపద అది. రాష్ట్రానికి ఆర్థికంగా ఊతాన్నిచ్చే బంగారు నిధి లాంటిది. ఆ ఎర్ర చందనం నిల్వలను కరిగించి మనీలా మార్చితే…. కేంద్రం చుట్టూనో, బ్యాంకుల చుట్టూనో తిరగాల్సిన పని లేకుండానే రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టులను పరుగులు పెట్టించ వచ్చన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది. కానీ అది జరగట్లేదు. అందుకు కారణం రియల్‌ పుష్పాలేనట. పుష్ప సినిమాలో ఈ ఎర్రచందనం స్మగ్లర్ల గురించి ఒక కోణమే చూపించారని.. ప్రస్తుతం స్మగ్లర్లు అనుసరిస్తున్న రెండో కోణంతో పుష్ప 3 సినిమా కూడా తీయవచ్చంటున్నారు

శ్రీ మహా విష్ణువు కొలువైన శేషాచలం అడవుల్లో దాగిన బంగారు నిధి ఎర్రచందనం. ప్రపంచంలో ఎక్కడా లేని ఈ అరుదైన కలపకు అంతర్జాతీయ మార్కెట్‌లో క్రేజ్ అంతా ఇంతా కాదు. ఒక్క టన్ను రెడ్ శాండిల్ ధర 2నుండి 3 కోట్లుంటుంది. చైనా, జపాన్‌లలో ఈ ఎర్రచందనంతో లగ్జరీ ఫర్నిచర్, సంగీత వాయిద్యాలు, ఔషధాలు తయారవుతాయి. చైనాలో అయితే కొత్త జంటకు ఎర్ర చందనంతో తయారుచేసిన అత్యంత విలువైన వస్తువులు కానుకగా ఇవ్వడం సాంప్రదాయమైన ఆనవాయితీ. దానికోసం వాళ్లు మన ఎర్ర బంగారాన్ని ఎంతైనా సరే పెట్టి కొనడానికి ఎగబడతారు. కానీ, ఈ సంపద రాష్ట్ర ఖజానాకు చేరకుండా స్మగ్లర్లు దోచుకుంటున్నారు.

పుష్ప లాంటి క్యారెక్టర్‌లు ఎర్రచందనం స్మగ్లింగ్‌ను బాగా హైలైట్ చేశాయి. పుష్ప పుణ్యమా అని… అడవుల్లో చెట్లు నరకడం దగ్గర నుండి షిప్పుల్లో దేశం దాటించే దాకా ఆ సినిమా చూసిన అందరికీ ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. అయితే రియల్‌ లైఫ్‌లో స్మగ్లర్లు ఆడే ఈ డ్రామా మరింత థ్రిల్లింగా ఉందంటున్నారు. రియల్‌ పుష్ప రాజ్‌లు నడిపించే దందాలో ఎవ్వరికీ తెలియని మరో కోణం దాగి ఉంది. పోలీసుల కళ్లుగప్పి స్మగ్లింగ్‌ చేయడమే కాదు… ఒకవేళ పోలీసులకు సరుకు పట్టుబడినా సరే.. మార్కెట్‌లో తమ ఆధిపత్యమే కొనసాగేలా చేయగల స్కిల్‌ ఈ రియల్‌ పుష్పాలది.

ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు తిరుపతి గోడౌన్లలో 950 టన్నుల ఎర్రచందనం నిల్వలున్నాయి. దీని విలువ అంతర్జాతీయ మార్కెట్‌లో 20 నుండి 25 వేల కోట్లు ఉటుందంట. కానీ, ఈ నిల్వలు వేలం వేయాలంటే స్మగ్లర్లు అడ్డుపడుతున్నారు. టెండర్ పిలిచినా, గోడౌన్లలోని సరకు అమ్ముడుపోకుండా.. రాజకీయ ఒత్తిళ్లు, అవినీతి నీలి నీడలు అడ్డుకుంటున్నాయని సమాచారం. ఎందుకంటే స్మగ్లర్లు కేంద్రం నుంచి రాష్ట్రం వరకు కూడా తమ బలాన్ని విస్తరించారు. రెడ్ శాండిల్ టాస్క్ ఫోర్స్ ఎంత వేటాడి పట్టుకుంటున్నా, స్మగ్లింగ్ ఆగడం లేదు. శేషాచలంలో రోజూ ఎక్కడో ఒకచోట కొత్త స్మగ్లింగ్ కేసు బయటపడుతోంది. సినిమాలో స్మగ్లర్లు పాల లారీలు, కూరగాయల ట్రక్కుల్లో రెడ్ శాండిల్‌ను తరలించే సీన్లు చూశాం. రియల్‌గానూ అంతకు మించిన టెక్నిక్స్ వాడుతున్నారు ఒరిజినల్ పుష్పాలు… అంబులెన్స్‌లు, రైస్ బ్యాగ్‌లు, కంటైనర్‌లలో దాచిపెట్టి రెడ్ శాండిల్‌ను విదేశాలకు చేరుస్తున్నారు. రోజుకో కొత్త ప్లాన్‌తో పోలీసులకు చుక్కలు చూపిస్తున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా, స్మగ్లర్లు ఒక అడుగు ముందే ఉంటున్నారు. ఈ స్మగ్లింగ్‌ గేమ్‌లో కింగ్‌ పిన్స్ ఎవరు? పొలిటికల్‌గా వారికి మద్ధతు ఎక్కడ నుండి వస్తోంది? వంటి ప్రశ్నలకు సమాధానాలు అంతుపట్టకుండా తయారవుతున్నాయి. ఈ నేపథ్యంలో రెడ్ శాండిల్ టాస్క్ ఫోర్స్ అధికారులు ఓ పరిష్కారం సూచిస్తున్నారు. ఒక్కసారిగా 1000 టన్నుల ఎర్రచందనాన్ని గ్లోబల్ మార్కెట్‌లో వేలం వేయాలి! ప్రభుత్వాల నుండే నేరుగా ఎంత కావాలన్నా ఎర్రచందనం కొనుక్కునే మార్గాలుంటే.. ఇక స్మగ్లర్లపై ఆధారపడాల్సి అవసరం చైనా, జపాన్‌ దేశాల వారికి ఉండదు. ఇలా చేస్తే స్మగ్లర్ల మార్కెట్ కుప్పకూలుతుంది. ఒక్క టెండర్‌తో రాష్ట్ర ఖజానాకు వేల కోట్లు వచ్చి పడతాయి. కానీ, ఈ టెండర్లను ఎందుకు ముందుకు తీసుకెళ్లలేకపోతున్నారనేదే అర్థం కాకుండా తయారవుతుంది.

ఇలా టన్నుల కొద్దీ ఎర్ర చందనం నిల్వలు గోడౌన్లలో మగ్గుతుంటే, స్మగ్లర్లు మాత్రం కోట్లకు పడగలెత్తుతున్నారు. ఈ ఎర్రచందనం సంపదను రాష్ట్రం కాపాడుకోవాలంటే, స్మగ్లర్ల ఆటకట్టించాలి. సర్కార్‌ ధైర్యంగా తీసుకునే ఒకే ఒక్క నిర్ణయం… గ్లోబల్ టెండర్…రాష్ట్ర భవిష్యత్తును మార్చేయగలదన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. లేదంటే, గోడౌన్లలో దాచి ఉంచిన వేల కోట్ల ఎర్రచందనం సంపద స్మగ్లర్ల చేతిలోనే ఆవిరయ్యే ప్రమాదముందంటున్నారు.