
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పునఃప్రారంభోత్సవ వేడుకల్లో సభా వేదికపై ప్రధాని నరేంద్ర మోడీ, ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మధ్య జరిగిన సంభాషణ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. లోకేష్‌ను ప్రధాని ఆప్యాయంగా పలకరించి.. భుజం తట్టి.. మరోసారి ప్రత్యేకంగా ఢిల్లీకి ఆహ్వానించారు. గత పర్యటనలోకూడా మోడీ ఇదే అంశాన్ని ప్రస్తావించడం గమనార్హం. లోకేష్‌ను కలిసిన ప్రతిసారి ఢిల్లీ వచ్చి ఎప్పుడు కలుస్తావని మోడీ ప్రస్తావించడం హాట్‌టాపిక్‌గా మారింది. లోకేష్‌ని చంద్రబాబు వారుసుడిగా కంటే ఏపీకి ఫ్యూచర్ లీడర్‌గా మోడీ చూస్తున్నరన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పునఃప్రారంభోత్సవ వేడుకల్లో ప్రధాని నరేంద్రమోడీ, మంత్రి నారా లోకేష్‌ల మధ్య సంభాషణ హాట్‌టాపిక్‌గా మారింది. సభా వేదికపై ప్రధాని , నారా లోకేష్‌ల మధ్య సరదా సంభాషణ జరిగింది. లోకేష్‌ను ప్రధాని ఆప్యాయంగా పలకరించి.. భుజం తట్టారు.. ‘నీకెన్ని సార్లు చెప్పాలి.. నన్ను కలవడానికి రావా?’ అని లోకేష్‌తో మోడీ అన్నారు. వెంటనే స్పందించిన మంత్రి నారా లోకేష్.. ‘త్వరలోనే కుటుంబ సమేతంగా ఢిల్లీకి వస్తానని ప్రధానితో అన్నారు. గత పర్యటనలో కూడా నారా లోకేష్‌తో ప్రధాని మోడీ ఇదే అంశాన్ని ప్రస్తావించిన సంగతి తెలిసిందే. అమరావతి పునఃప్రారంభోత్సవంలో ప్రధాని నరేంద్ర మోడీ రూ.58వేల కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన సంగతి తెలిసిందే.
ఈ సందర్భంగా ప్రసంగించిన లోకేష్ అమరావతి రాజధాని నిర్మాణం ఆగకుండా కొనసాగుతుందని.. రాష్ట్ర అభివృద్ధి వికేంద్రీకరణ కూడా వేగంగా జరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టు, విశాఖ ఉక్కు కర్మాగారం, భోగాపురం విమానాశ్రయం, ప్రకాశం జిల్లాలో సీబీజీ ప్లాంటు, కర్నూలులో హైకోర్టు బెంచ్ వంటి పనులు వేగంగా జరుగుతాయన్నారు. అమరావతికి మోడీ శంకుస్థాపన చేశారని, దానిని ఆపే దమ్ము ఎవరికీ లేదని లోకేష్ అన్నారు. 1,631 రోజులు పోరాడి అమరావతిని నిలబెట్టిన రైతులకు నమస్కరించారు. ఇప్పుడు మళ్లీ మోడీ చేతుల మీదుగానే పనులు మొదలవుతాయని, ఇక అమరావతిని ఎవరూ ఆపలేరన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో మోదీ, చంద్రబాబుతో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఉందని, అభివృద్ధి, సంక్షేమం జోడెద్దులుగా ముందుకు సాగుతాయన్నారు. రైతుల త్యాగం వల్లే అమరావతి సాధ్యమైందని ఆయన అభినందించారు.
గత ప్రభుత్వం అమరావతిని చంపేయాలని చూసిందని లోకేష్ విమర్శించారు. 2019-24 వరకు విధ్వంస పాలన చూశామని, చంద్రబాబుపై వ్యక్తిగత కక్షతో అమరావతిని నాశనం చేయాలని చూశారని ఆయన ఆరోపించారు. ఒక్క ఇటుక కూడా వేయకుండా మూడు రాజధానులంటూ ఐదేళ్లు గడిపేశారని అన్నారు. ఎన్ని కుట్రలు చేసినా అమరావతి నినాదాన్ని ఆపలేకపోయారని, అమరావతి ఎవరి ఇంట్లోనో పెంచుకునే మొక్క కాదని, అది ప్రజల గుండెల్లో దాచుకున్న రాజధాని అన్నారు.
అమరావతి సభలో లోకేష్ ప్రసంగం ప్రధాని మోడీ సహా అందరి ప్రశంసలు అందుకుంటోంది. సభోల మోడీ స్వయంగా లోకేష్‌తో ముచ్చటించిన తీరుతో ప్రధాని మోడీ,లోకేష్ మధ్య బంధం బలపడుతోందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. లోకేష్‌ను అప్యాయంగా పలకరించిన మోడీ, తనను కలవాలని కోరడం, గతంలోనూ ఇలాగే ఆహ్యానించడంపై యువనేతకు పెరుగుతున్న ప్రాధాన్యతపై తెలుగుతమ్ముళ్లు ఖుషీ అవుతున్నారు. నీకు ఎన్నిసార్లు చెప్పాలి.. నన్ను కలవాలని అని ప్రధాని పర్సనల్‌గా లోకేష్‌తో అనడంపై అటు బీజేపీ,ఇటు టీడీపీలో ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. ఇద్దరి మధ్య బాండింగ్ పెరుగుతోందని, అటు పార్టీ కార్యక్రమాలు, ఇటు పాలనలో తనదైన ముద్ర వేస్తున్న లోకేష్‌ను మోడీ ఏపీకి ఫ్యూచర్ లీడర్‌గా చూస్తున్నామన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అందుకే ప్రధాని తగిన ప్రాధాన్యత ఇస్తున్నారన్న చర్చ జరుగుతోంది
సాధారణంగా ప్రధాని మోడీ నుంచి ఆహ్వానం వస్తే కాదనేవారుండరు. అలాంటిది ఏపీలో ఒక మంత్రిగా ఉన్న లోకేష్‌ని తనను కలవమని ప్రధాని పదేపదే అడుగుతుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రధాని మోడీ నోటి నుంచి తమ పేరు వస్తే చాలు.. అదే పది వేలుగా ఫీలయ్యే నేతలు బోలెడెంత మంది ఉన్నారు. అలాంటిది లోకేష్‌కు మోడీ ఇస్తున్న ప్రాధాన్యతపై ఇప్పుడు అందరూ చర్చించుకుంటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా నారా లోకేష్‌ను తనను కలవాలని అడగడంపై అటు సామాన్యుల్లోను, పార్టీలోను రకరకాల చర్చలు మొదలయ్యాయి. ఈ ఏడాడిలోనే విశాఖలో జరిగిన ఓ కార్యక్రమానికి వచ్చిన ప్రధాని మోడీ…అధికారంలోకి వచ్చి ఆరు నెలలైనా తనను ఎందుకు కలవలేదని లోకేష్‌తో అన్నారు. సమయం చూసుకుని మిమ్మల్లి కలుస్తానని అప్పుడు ప్రధానికి లోకేష్ చెప్పారు. తిరిగి సేమ్ సీన్ రిపీట్ అవ్వడం హాట్‌టాపిక్‌గా మారింది
ఇంతకూ ప్రధాని మోడీ తనను కలిసేందుకు రావాలని లోకేశ్ ను పిలిచినా.. ఎందుకు వెళ్లడం లేదు? అన్న ప్రశ్న ఇప్పుడు టీడీపీ నేతలను తోలుస్తోంది. చంద్రబాబు అరెస్టు సమయంలో ఢిల్లీ స్థాయిలో ఈ అంశాన్ని తీసుకెళ్లడంలో లోకేష్ సక్సెస్ అయ్యారు. కేసు విషయంలో న్యాయనిపుణులతో చర్చించడంతో పాటు అటు బీజేపీ పెద్దలతోను లోకేష్ చర్చలు జరిపారు. అప్పటి పరిస్ధితుల్లో బీజేపీ పెద్దలతో తనదైన శైలిలో మంచి సంబంధాలను బలపరుచుకోవడంలో లోకేష్ రాజకీయంగా సక్సైస్ అయ్యారన్న టాక్ ఉంది
ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో నారా లోకేష్ కేంద్ర బిందువుగా మారుతున్నారు. 2019 ఎన్నికల్లో ఓటమితో విమర్శలు ఎదుర్కొన్న లోకేష్….2024 ఎన్నికల్లో సాధించిన ఘనవిజయంతో విమర్శకుల నోళ్లకు గట్టి తాళమే వేశారు. ఎన్నికల ముందు నుంచే ఆయన పార్టీ కార్యక్రమాల్లో తనదైన ముద్రవేసిన లోకేష్….పాలనలో తనకంటూ కొత్త ఒరవడిని క్రియేట్ చేసేలా అడుగులు వేస్తున్నారు. అందుకే ప్రధాని మోడీ సైతం లోకేష్‌ని భవిష్యత్తు నాయకుడిగా చూస్తూ తనను వచ్చి కలవాలని కోరడం జరుగుతోందనేది పార్టీలో చర్చ నడుస్తోంది. చంద్రబాబుతో పాటుగా లోకేష్ కూడా టీడీపీలో ముఖ్య పాత్ర పోషిస్తున్న క్రమంలో బీజేపీ నాయకత్వం కూడా లోకేష్‌ని ప్రోత్సహిస్తోందంటున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో పాటు కేంద్ర బీజేపీ పెద్దలు కూడా టీడీపీ రాజకీయ వారసుడి విషయంలో సానుకూలంగానే ఉన్నారనే సంకేతాలు తాజా ఘటనతో వెలువడినట్లైంది