జగన్ కొత్త రాజకీయం …

జగన్ పొలిటికల్ స్ట్రాటజీలు ఆ పార్టీ వారికే అంతుపట్టకుండా తయారవుతున్నాయంట. ప్రతిపక్ష నేత మోదా కూడా లేకుండా పోయిన మాజీ ముఖ్యమంత్రి జగన్ ప్రజల్లోకి రావడానికి ఎంచుకుంటున్న ఇష్యూలు, సందర్భాలు వివాదాస్పదంగా మారుతున్నాయి. రాష్ట్రంలో ఏవైనా అవాంఛనీయ ఘటనలు జరిగినప్పుడు, మరణాలు సంభవించినప్పుడు, తన పార్టీ నేతలు అరెస్ట్ అయినప్పుడు మాత్రమే జగన్ బయటకు వస్తుండటం వైసీపీ శ్రేణులకే మింగుడుపడటం లేదంట. అంతకు ముందు తిరుమలలో, తాజాగా సింహాచలంలో మాజీ సీఎం చేసిన హడావుడి తనపై పడిన మత ముద్రను చెరిపేసుకుని, ప్రజల్లో చీలికలు తేవడానికే అన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది

మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు, పులివెందుల ఎమ్మెల్యే జగన్ అధికారంలో ఉన్నంత కాలం అది శాశ్వతమన్న అతివిశ్వాసంతో కనిపించారు. తీరా చూస్తూ ఆయన పార్టీకి 11 సీట్లతో ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయింది. అయినా అధికారం మీద యావతో.. క్యాబినెట్ హోదా ఉన్న ప్రధాన ప్రతిపక్ష నేత హోదా కోసం ఆయన మంకుపట్టుపడుతున్నారు. ఆ హోదా దక్కదని తెలిసినా న్యాయపోరాటాలంటూ హడావుడి చేస్తున్నారు. ఆ క్రమంలో అసెంబ్లీకి ముఖం చాటేస్తున్నారు. అధికారం కోల్పోయిన ఈ పది, పదకొండు నెలల్లో ఆయన పట్టుమని పది సార్లు కూడా ప్రజల్లోకి రాలేదు. అయితే బెంగళూరు ప్యాలెస్, లేకపోతే తాడేపల్లి కోట, పులివెందుల అన్నట్లు షట్లింగ్ చేస్తూ గడిపేస్తున్నారు.

ఓటమి తరువాత నిండా ఏడాది గడవకుండానే జగన్ మళ్లీ అధికారంపై మమకారం పెంచేసుకున్నారు. అప్పుడే కూటమి సర్కారుపై వ్యతిరేకత పెరిగిపోయిందని, తిరిగి అధికారంలోకి వచ్చేది తామే అని.. ఈ సారి గెలిచి ముప్పై ఏళ్లు అధికారంలో ఉంటామని స్టేట్‌మెంట్లు మొదలెట్టారు. జగన్ -2.0 పాలన డిఫరెంట్ స్టైల్లో ఉంటుందని, క్యాడర్‌కు ప్రాధాన్యత ఇస్తామని తెగ ధీమా ప్రదర్శించడం మొదలుపెట్టారు

వైసీపీ అధ్యక్షుడిగా, పులివెందుల ఎమ్మెల్యేగా సరిపెట్టుకోలేకపోతున్న మాజీ సీఎం.. ఎప్పుడెప్పుడు మళ్లీ సీఎం అయిపోదామా? అన్నట్లు వ్యవహరిస్తున్నారని వైసీపీ శ్రేణులే గొణుక్కుంటున్నాయి. ప్రజలతో మమేకం కావడం, ప్రజా సమస్యలపై పోరాడటం వంటివి మానేసి …ప్రభుత్వంపై ప్రజలను రెచ్చగొట్టడం, సమాజంలో చీలికలు తీసుకు వచ్చి, అశాంతిని రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దానికి తగ్గట్లే ఆయన ప్రజల్లోకి వస్తున్న సమయం, సందర్భం వివాదాస్పదమవుతున్నాయి.

రాష్ట్రంలో ఎప్పుడే ఉపద్రవం జరుగుతుందా? ఎక్కడే విషాదం చోటు చేసుకుంటుందా? అని ఎదురు చూస్తున్నట్లు ఆయా సందర్భాల్లోనే ఆయన బయటకు వచ్చి హడావుడి చేస్తున్నారు. మరణాలు సంభవించినప్పుడో? తన పార్టీ ముఖ్య నేతలు అరెస్ట్ అయినప్పుడో జైళ్లలో పరామర్శకు ఎంట్రీ ఇస్తున్నారు. ఆ వచ్చిన సమయంలో కూడా బాధితులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పడం కంటే.. కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేసి.. తాను మళ్లీ అధికారంలోకి రాగానే.. అంటూ హెచ్చరికలు చేయడానికే పరిమితమవుతున్నారు.

తాజాగా సింహాచలంలో జరిగిన దురదృష్టకర ఘటనలో ఏడుగురు మరణించారు. వెంటనే జగన్ బాధిత కుటుంబాల పరామర్శ అంటూ సింహాచలంలో వాలిపోయారు. అయితే జగన్ అక్కడకు చేరుకోవడానికి ముందే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం మృతుల కుటుంబాలకు పాతిక లక్షల రూపాయల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించేసింది. అలాగే బాధిత కుటుంబాలలో ఒకరికి దేవాదాయ శాఖలో ఔట్ సోర్సింగ్ విధానం ద్వారా ఉద్యోగం ఇవ్వనున్నట్లు పేర్కొంది. దాంతో సింహాచలంలో జగన్ వాయిస్ మారిపోయింది. బాధిత కుటుంబాలకు ఇచ్చిన నష్టపరిహారం సరిపోదని, గతంలో ఎల్జీ పాలిమర్స్ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు తాను కోటి రూపాయలు నష్టపరిహారం ప్రకటించాననీ, ఇప్పుడు సింహాచలం ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు కూడా అంతే పరిహారం ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. లేకపోతే తాను అధికారంలోకి వచ్చిన తరువాత బాధిత కుటుంబాలకు మిగిలిన రూ.75 లక్షలు తాను ఇస్తానని ప్రకటించారు.

వాస్తవానికి ఎల్జీ పాలిమర్స్ ఘటన పూర్తిగా మానవ తప్పిదం, ఆ కంపెనీ యాజమాన్యం నిర్లక్ష్యం. కానీ సింహాచలంలో జరిగింది పూర్తిగా వేరు. ఇక్కడ భారీ వర్షం కారణంగా గోడ కూలి భక్తులు మరణించారు. ఈ విషయాన్ని విస్మరించి జగన్ రాజకీయ లబ్ధి కోసం తాము అధికారంలోకి వచ్చాక పరిహారాన్ని రూ.కోటి చేస్తామని స్టేట్‌మెంట్ ఇవ్వడం వైసీపీ నేతలకే మింగుడుపడటం లేదంట. నిజంగా ఆయనకు కమిట్‌మెంట్ ఉంటే పార్టీ పరంగానో, వ్యక్తిగతంగానో బాధిత కుటుంబాలకు ఎంతో కొంత సాయం ప్రకటించి ఉంటే బాగుండేది వైసీపీ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయంట.

కూటమి ప్రభుత్వం ఏర్పడిన కొత్తల్లో బుడమేరు పొంగి బెజవాడ ముంపునకు గురైంది. అప్పుడు అక్కడకి వచ్చిన వచ్చిన జగన్ వరద బాధితులకు రూ.కోటి విరాళం ప్రకటించారు. అది గుర్తు చేస్తూ జగన్ ముందు విజయవాడ బుడమేరు ముంపు సమయంలో ప్రకటించిన కోటి రూపాయల విరాళం మాటేమిటని నెటిజన్లు నిలదీస్తున్నారు. అయినా జగన్ సింహాచలం వచ్చింది బాధితులను పరామర్శించి ఓదార్చడానికా లేక రాజకీయం చేయడానికా అని ప్రశ్నిస్తున్నారు. తనపై ఉన్న మతముద్రను చెరిపేసుకోవడానికి జగన్ మొన్న తిరుమలలో, ఇప్పుడు సింహాచలంలో రాజకీయం చేయాలని చూస్తున్నారని మండిపడుతున్నారు.