తాడేపల్లిగూడెం మిత్రులు…

ఆ నియోజవర్గంలో ఇప్పటివరకు ఆ ఇద్దరు రాజకీయా నేతలు ఒకరి పై ఒకరు కారాలు మిరియాలు నూరుకున్నారు. నన్ను పట్టించుకోవడం లేదంటే కాదు నువ్వే నన్ను పట్టించుకోలేదు అంటూ అలిగి దూరం జరిగారు. ఆ ఇద్దరి నేతల అనుచరులు తమ గుర్తింపు కోసం మరింత అగ్గి రాజేసే ప్రయత్నాలు చేశారు. వారెవరో కాదు తాడేపల్లిగూడెం నియోజకవర్గం జనసేన పార్టీ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అయితే మరొకరు టీడీపీ ఇన్చార్జి వలవల బాబ్జి.. నేను చనిపోవాలని కోరుకుంటున్నారు అంటూ గూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ బహిరంగంగా మాట్లాడటంతో ఒక్కసారిగా కూటమిలో ఉన్న విభేదాలు బయటపడ్డాయని అందరూ భావించారు.. ఇంతలోనే వారిద్దరూ మళ్లీ దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరా జాన్ అంటూ కలిసి తిరిగేస్తున్నారు. అసలు తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఏమైంది ? ఆ నేతలిద్దరి మధ్య మనస్పర్ధలకు కారణమేంటి? సడన్‌గా అంత క్లోజ్ ఫ్రెండ్స్ ఎందుకయ్యారు?

రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరనే మాటను పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో మరోసారి రుజువు చేశారు కూటమి నేతలు. పరిస్థితులు మారితే ప్రత్యర్థులే మిత్రులవుతారు అనటానికి ప్రత్యక్ష ఉదాహరణగా కూటమి నేతలు నిలిచారు. ఇప్పటి వరకు చెడిపోయిన రిలేషన్ లా కనిపించిన జనసేన–టీడీపీ నాయకుల మధ్య స్నేహసంధి కుదిరినట్టే కనిపిస్తుంది. ఇకపై మనస్పర్థలే కాదు… మాటల తూటాలకూ బ్రేక్ పడింది అంటూ రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గం లో జనసేన పార్టీ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ బహిరంగంగా చేసిన వ్యాఖ్యలతో ఒక్కసారిగా కూటమిలో ఏం జరుగుతుంది అనేది రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా నిలిచింది .

ఇక కూటమి మిత్రత్వానికి బీటలు వారినట్టుగానే అందరూ భావిస్తున్న తరుణంలో ఇరు పార్టీల అగ్ర నేతలు రంగంలోకి దిగారంట. తాడేపల్లిగూడెం నియోజకవర్గం టీడీపీ, జనసేన నేతల మధ్య వివాదం మరింత ముదరకుండా నష్ట నివారణ చర్యలను చేపట్టినట్లు తెలుస్తోంది. ఆ క్రమంలో అక్కడి నేతలు అమరావతి పునర్నిర్మాణ సభను తాడేపల్లిగూడెం నియోజకవర్గం లో విభేదాలకు స్వస్తి పలకడానికి వేదికగా చేసుకున్నారు. టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ జనసేన పార్టీ ఎమ్మెల్సీ హరిప్రసాద్ నేతృత్వంలో సమన్వయ కమిటీ భేటీ అయింది. ఈ భేటీకి తాడేపల్లిగూడెం నియోజకవర్గం జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్‌తో పాటు టీడీపీ ఇన్చార్జి వలవల బాబ్జి హాజరయ్యారు.

కమిటీ ముందు తాడేపల్లిగూడెం నియోజకవర్గం టీడీపీ ఇన్చార్జ్ బాబ్జి నియోజకవర్గంలో ఉన్న ఇబ్బందులను ఏకరు పెట్టారంట. సరైన ప్రాధాన్యత లేకపోవడం, నియోజకవర్గం అభివృద్ధి కార్యక్రమాల్లో ఆహ్వానాలు సరిగా అందడం లేదంటూ సమన్వయ కమిటీ దృష్టికి తీసుకెళ్లారట. జనసేన పార్టీ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సైతం తను ఎందుకు బహిరంగంగా మాట్లాడాల్సి వచ్చిందో సమన్వయ కమిటీ నేతలతో చెప్పారట. సుమారుగా మూడు గంటల పాటు జరిగిన సమావేశంలో టిడిపి జనసేన అధిష్టానం కూటమి స్నేహం కొనసాగటానికి ఎంత పకడ్బందీగా కార్యచరణ రూపొందిస్తున్నారో సమన్వయ కమిటీ నేతలు ఇద్దరికీ అర్థమయ్యేలా చెప్పారట. సమన్వయ కమిటీ లో చర్చలు అనంతరం అసలు తమ మధ్య ఉన్నవి విభేదాలే కాదని తాము ఎప్పటినుండో స్నేహితులం అంటూ ఇటు వలవల బాబ్జి అటు జనసేన పార్టీ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఒకరినొకరు ఆలింగనం చేసుకోవడంతో షాక్ తినడం సమన్వయ కమిటీ వంతు అయిందంట.

ఎమ్మెల్యే శ్రీనివాస్, బాబ్జిలు రాజకీయాల్లోకి రాక ముందు నుండే మంచి మిత్రులమని సమన్వయ కమిటీకి చెప్పారట.. టీడీపీ అధినేత అధ్యక్షులు చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేతృత్వంలో కూటమి బలోపేతానికి కార్యకర్త నుండి ఎమ్మెల్యే వరకు అందరం కష్టపడి పనిచేస్తామని సమన్వయ కమిటీలో స్పష్టం చేశారంట. తాడేపల్లిగూడెం నియోజకవర్గం కూటమి లో రాజకీయ వివాదానికి సమన్వయ కమిటీ భేటీతో ఇక పుల్ స్టాప్ పడిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కుటుంబాల్లోనే చిన్నచిన్న ఇబ్బందులు ఉన్నప్పుడు రెండు పెద్ద రాజకీయ పార్టీలు కలిసి ప్రయాణం చేసేటప్పుడు వచ్చే ఇబ్బందులను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు జనసేన ఎమ్మెల్సీ హరిప్రసాద్.

జనసేన పార్టీ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, టీడీపీ ఇన్చార్జ్ వలవల బాబ్జి సైతం తాడేపల్లిగూడెం కలిసి పనిచేస్తామంటూ, నియోజకవర్గంలో ఆయా పార్టీల కార్యకర్తలకు ఇబ్బందులు లేకుండా కూటమిని బలోపేతం చేస్తామని సమన్వయ కమిటీకి హామీ ఇచ్చారట. దాంతో టిడిపి జనసేన మధ్య బహిరంగ మాటల యుద్ధంతో తమకు కలిసి వస్తుందని భావించిన వైసీపీ నేతలు ఆశలపై సమన్వయ కమిటీ నీళ్లు చెల్లిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. వివాదం ముదిరిన కొన్ని గంటల్లోనే సమన్వయ కమిటీ భేటీ అవ్వటం ఇద్దరు నేతల గౌరవాన్ని తగ్గకుండా వివాదాన్ని పరిష్కరించడం పై కార్యకర్తలు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

పవన్ కళ్యాణ్ బాహుబలి అని ప్రేమగా పిలుచుకునే ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం జనసేన పార్టీ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ తాజాగా చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపాయి. చాలా కష్టపడి రాజకీయాల్లోకి వచ్చానని, ఒక ఆర్టీసీ డ్రైవర్ కొడుకుగా ఎమ్మెల్యే అయిన తాను ప్రజలకు ఎంతో సేవ చేయాలనుకుంటున్నాని బొలిశెట్టి శ్రీనివాస్ మొదటి నుండి చెప్తూ వస్తున్నారు. అలాంటాయన తాను చనిపోతే బాగుండు, బైపోల్స్ వస్తాయని ఎదురు చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ఎమ్మెల్యేగా తనను ప్రజలు గెలిపించుకున్నారని, ఎవరు త్యాగం చేస్తేనో తాను ఎమ్మెల్యే అవ్వలేదని చురకలు అంటించారు.

అసలు బొలిశెట్టి శ్రీనివాస్‌ను అంత మానసిక క్షోభకు గురి చేసింది ఎవరు అనేదానిపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ మొదలైంది. ఆయన వ్యాఖ్యలతో జనసేన, టీడీపీల మధ్య ఉన్న విభేదాలు ఒక్కసారిగా బయటపడ్డాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అటు నియోజకవర్గ టీడీపీ నాయకులు, అటు ఎమ్మెల్యేతో పాటు జనసేన ముఖ్య నేతలు మధ్య అధికారులు నలిగిపోతున్నారన్నది వాస్తవం అంటున్నారు. జనసేన పార్టీ ఎమ్మెల్యేగా గెలిచిన దగ్గర నుండి బొలిశెట్టి శ్రీనివాస్ తనదైన శైలిలో ప్రజల్లో దూసుకుపోతున్నారు. మిత్రపక్షాలకు ఇబ్బంది లేకుండా జనసేన పార్టీని బలోపేతం చేసుకుంటూ ఇటు ప్రజలకు నిరంతరం దగ్గరగా ఉంటూ ఎప్పటికప్పుడు వారి సమస్యలకు పరిష్కారం చూపించే ప్రయత్నం చేస్తున్నారు. అటువంటి బొలిశెట్టి శ్రీనివాస్ ఒక్కసారిగా ఆవేదనతో మాట్లాడటంతో అసలు ఏమైంది అనే దానిపై రాష్ట్ర నేతలు సైతం ఆరా తీయటం మొదలు పెట్టారు

ఆ క్రమంలో మిత్రపక్షాల సమన్వయ కమిటీ రంగంలోకి దిగి పరిస్థితి చక్కపెట్టిందంట. ఇప్పటివరకు ఏం మాట్లాడితే ఎవరు ఎలా తీసుకుంటారో అని ఆలోచించిన రెండు పార్టీల కార్యకర్తలు తమ నేతలు ఇద్దరు ఆలింగనం చేసుకుని, కలిసి ఉంటామని ప్రకటించడంతో రిలాక్డ్స్‌గా ఫీలవుతున్నారు. రాజకీయంగా ఎన్ని ఇబ్బందులైనా కూర్చుని మాట్లాడుకునే విధంగా స్వయోధ్య జరిగిందని కూటమి నేతలను ఎవరు విడదీయలేరని ఆనందపడిపోతున్నారు. విభేదాలు పక్కన పెట్టి వివాదాలకు తావు లేకుండా తాడేపల్లిగూడెం నియోజకవర్గం అభివృద్ధి అనే గమ్యం కోసం కూటమి నేతలు అందరం కష్టపడతామంటూ ప్రతిజ్ఞ చేస్తున్నారు టిడిపి, బీజేపీ, జనసేన పార్టీ నేతలు. కూటమి పార్టీల బంధం చిరకాలం కొనాగుతుందని జనసేనాని పవన్ కళ్యాణ్ చెప్తున్నట్లు పార్టీల నాయకులు కూడా అదే రూటులో కొనసాగుతుండటంతో మిత్రపక్షాల శ్రేణుల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తున్నాయి.