DCCB చైర్మన్ గా నాగార్జున…

విజయనగరం జిల్లా డీసీసీబీ బ్యాంకు చైర్మన్‌గా టీడీపీ జిల్లా పార్లమెంటరీ అధ్యక్షుడు కిమిడి నాగార్జున నియమితులయ్యారు. బొత్స సత్యనారాయన రాజకీయ ప్రస్థానం ప్రారంభం అయింది కూడా అక్కడ నుంచే. డీసీసీబీ చైర్మన్‌గా పొలిటికల్ కెరీర్ మొదలుపెట్టిన బొత్స రాజకీయంగా అనేక కీలక పదవులు నిర్వహించి ప్రస్తుతం శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు. ఇప్పుడు నాగార్జుల ఆ పదవి చేపట్టడం, అటు బొత్స, ఇటు నాగార్జున ఇద్దరూ చీపురుపల్లి నాయకులే అవ్వడంతో రాజకీయవర్గాల్లో ఆసక్తికర చర్చ మొదలైంది. మరోవైపు బొత్స సహకార బ్యాంకును బ్రష్టు పట్టించారన్న ఆరోపణలున్నాయి. ఆ క్రమంలో ఉన్నత విద్యావంతుడైన కిమిడి నాగార్జునకు బ్యాంకును ప్రక్షాళన చేసి తనదైన మార్క్ చూపిస్తారా?

డీసీసీబీ .. జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ .. ఈ పేరు జనరల్ గా రైతులకు తప్ప మిగతవారికి పెద్దగా పరిచయం ఉండదు . కానీ ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఈ బ్యాంకు తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు . జిల్లా రాజకీయాలను మలుపు తిప్పింది ఈ బ్యాంక్ . అవును మీరు విన్నది నిజమే . మాజీమంత్రి , శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రభుత్వ పదవులు, క్రియాశీల రాజకీయ ఆరంగేట్రం ఇక్కడినుండే మొదలైంది . ఈ పదవి చేపట్టిన తరువాత వెనుతిరిగి చూసుకోలేదు బొత్స . విజయనగరం డీసీసీబీ ఛైర్మన్ పదవి అంటే జిల్లా నామినేటెడ్ పదవుల్లో దాని క్రేజే వేరు . 1916 లో ఈ బ్యాంక్ ఆవిర్భవించినప్పటికీ .. ఇప్పటికీ బొత్సకి ముందు బొత్స తరువాత అని అంటారంటే దాంతో ఆయనకు ఎంతగా బంధం పెనవేసుకుపోయిందో అర్ధం చేసుకోవచ్చు . ఈ బ్యాంకుకు వందేళ్ల చరిత్ర ఉన్నప్పటికీ సత్తిబాబు ఛైర్మన్ అయ్యాకనే జన బాహుళ్యంలోకి వెళ్ళింది . అంతేకాదు సత్తిబాబు అవినీతి చరిత్ర కూడా ఇక్కడినుంచే మొదలయ్యిందనే ఆరోపణలు ఉన్నాయి .

సుమారు 40 ఏళ్ల తరువాత తెలుగుదేశం పార్టీకి ఈ పదవి దక్కింది . 2019 ఎన్నికల్లో చీపురుపల్లి నుంచి బొత్స సత్యనారాయణపై పోటీ చేసి ఓడిపోయిన కిమిడి నాగార్జునకు ప్రభుత్వం డీసీసీబీ చైర్మన్ పదవి కట్టబెట్టింది. గత ఎన్నికల్లో కిమిడి నాగార్జున చీపురుపల్లి టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేయాల్సి ఉన్నప్పటికీ, అనూహ్య పరిణామాల మధ్య కిమిడి కళావెంకట్రావు అక్కడ నుంచి బరిలోకి దిగి విజయం సాధించారు. టికెట్ దక్కకపోవడంతో అప్పట్లో అసంతృప్తికి గురై అలకపాన్ను ఎక్కిన నాగార్జునను టీడీపీ అధిష్టానం బుజ్జగించి సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చింది. ఆ మేరకు తాజాగా డీసీసీబీ చైర్మన్‌గా నియమించింది.

అప్పుడు బొత్స సత్యనారాయణ, ఇప్పుడు కిమిడి నాగార్జున ఇద్దరూ చీపురుపల్లి నియోజకవర్గానికి చెందిన నాయకులే. అందుకే చీపురుపల్లికి డీసీసీబీకి అవినాభావ సంబంధం ఉందని అంటున్నారు విశ్లేషకులు . ఆనాడు సత్తిబాబు ఇక్కడి నుండే రాజకీయ ఓనమాలు దిద్దగా , నేడు నాగార్జున కూడా అదే మాదిరి రాజకీయ నైపుణ్యానికి ఏ మేరకు పదును పెడతారో అని జిల్లా వాసులు ఎదురు చూస్తున్నారు. పార్టీకి నాగార్జున అందించిన సేవలకు గాను అధిష్టానం ఆయనకు ఈ కీలక పదవిని అప్పగించింది . ముఖ్యంగా 2019 నుండి 2024 వరకు అప్పటి అధికార వైసీపీ తప్పులను ఎండగట్టడంలో నాగార్జున ముందు వరుసలో నిలిచారు .

ముఖ్యంగా అవకాశం దొరికినప్పుడల్లా అటు జగన్ , ఇటు బొత్స సత్యనారాయణలపై విమర్శనాస్త్రాలు సంధించేవారు . 2024 ఎన్నికల్లో చీపురుపల్లి టికెట్ దక్కనప్పుడు కాస్త అసంతృప్తికి లోనైనా , అధిష్టానం బుజ్జగింపులతో ఎన్నికల్లో స్టార్ క్యాంపైనర్ గా ఉత్తరాంధ్రలో ప్రచారం నిర్వహించారు . నాగార్జునకు నామినేటెడ్ పదవి దక్కడంతో అటు చీపురుపల్లి, ఉమ్మడి విజయనగరం తెలుగు తమ్ముళ్లలోనూ ఆనందం వెల్లివిరుస్తోంది . అందరికీ సుపరిచితుడుగా , స్నేహ శీలిగా ఉండే నాగార్జునకు కీలక పదవి ఇవ్వడంపై హర్షం వ్యక్తమౌతోంది.

అలా అని నాగార్జునకు ఈ పదవి పూలపాన్పు కాదు ముళ్ళబాట కూడా అంటున్నారు. ఆయన సమర్ధతకు ఇది కఠిన పరీక్షగా చెబుతున్నారు . వందేళ్లకు పైగా చరిత్ర , 1.30 లక్షల మంది సభ్యులు, 94 పీఏసీఎస్ లు, 24 బ్రాంచెస్ , ఏటా రెండు కోట్ల రూపాయల టర్నోవర్ కలిగిన ఈ బ్యాంకుకు రాజకీయ మకిలి అంటుకుంది . రుణాలు నుంచి ఉద్యోగాల వరకు అంతా రాజకీయ ప్రమేయంతోనే అన్నట్లుగా సాగింది ఇన్నాళ్ళూ . అప్పట్లో కాంగ్రెస్, తరువాత వైసీపీ నాయకులకు ఇది రాజకీయ పునరావస కేంద్రంగా మారిందనే విమర్శలు ఉన్నాయి . బినామీల పేర్లతో కోట్ల రూపాయల రుణాలు తీసుకొని ఎగనామం పెట్టినా అడిగే నాథుడే లేకుండా పోయాడు . 2014లో సమైక్యాంధ్ర ఉద్యమం ముసుగులో ఈ బ్యాంకు దగ్ధం అవ్వడం ఇందుకు నిదర్శనంగా చెబుతుంటారు .

గతంలో విజయనగరం పర్యటనకు వచ్చిన ప్రతిసారీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా బొత్స సత్యనారాయణ డీసీసీబీ ని నాశనం చేశారంటూ పలు ఆరోపణలు గుప్పించారు . అంతటి అవినీతి ఆరోపణలున్న ఈ బ్యాంకును గాడిలో పెట్టడం అంత సులభం కాదన్న అభిప్రాయం ఉంది . మరి ఉన్నత విద్యావంతుడైన నాగార్జున ఈ బ్యాంకును గాడిలో పెట్టి, దానిపై బొత్స మార్కును చెరిపేసి , ప్రక్షాళన చేసి సరికొత్త అధ్యాయం లిఖిస్తారేమో వేచి చూడాలి.