గ్రంధి శ్రీనివాస్ దారెటు …

రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఓటమి తర్వాత సైలెంట్ అయిపోయారు. వైసీపీకి దూరం జరిగిన ఆ కాపు నాయకుడు ఇంత వరకు ఏ పార్టీలో చేరబోతున్నారన్నదానిపై క్లారిటీ ఇవ్వడంలేదు. క్షత్రియరాజులు ఇలాకాగా ఉన్న భీమవరం రాజకీయాన్ని కాపు సామాజిక వర్గం పరం చేసిన గ్రంధి ఇంకా ఎంత కాలం మౌనంగా ఉంటారనేది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

మాస్ లీడర్‌గా నిత్యం ప్రజల్లో ఉండే గ్రంధి శ్రీనివాస్ 2019 ఎన్నికల్లో పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో వైసిపి నుండి పోటీ చేసి జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను ఓడించి తన సత్తా చాటుకున్నారు. అయితే 2024 ఎన్నికల్లో వైసీపీ నుండి మరోసారి బరిలోకి దిగిన గ్రంధి శ్రీనివాస్ ఓటమి చవి చూశారు. కొద్ది నెలల క్రిందట వైసీపీకి రాజీనామా చేసి ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అయితే త్వరలోనే గ్రంధి శ్రీనివాస్ తిరిగి రాజకీయంగా తెరపైకి రానున్నట్లు ప్రచారం జరుగుతుంది. వైసిపి పార్టీని వీడిన ఆయన తెలుగుదేశం పార్టీలో చేరతారా, లేక జనసేన పార్టీలోకి వెళ్తారా, లేక ఈ రెండు కాకుండా తిరిగి వైసిపి చెంతకు చేరతారా అనే దానిపై ప్రస్తుతం చర్చ జరుగుతుంది.

గ్రంధి శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీతో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. 2004 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ భీమవరం టౌన్ అధ్యక్షుడిగా ఉన్న గ్రంధి శ్రీనివాస్ 2004లో ఎమ్మెల్యే గా పోటీ చేసి తెలుగుదేశం సీనియర్ నాయకులు పీవీ నరసింహారాజు మీద గెలుపొందారు. వాస్తవానికి అప్పటివరకు భీమవరం నియోజకవర్గం రాజకీయం అంతా క్షత్రియరాజుల చుట్టే తిరిగేది. గ్రంధి శ్రీనివాస్‌కు ఉన్న మాస్ ఇమేజ్‌తో క్షత్రియుల చేతి నుండి భీమవరం నియోజకవర్గం కాపుల చేతుల్లోకి మారింది. 2009లో కాంగ్రెస్ పార్టీ నుండి టిక్కెట్ రాకపోవడంతో ఆయన పోటీకి దూరంగా ఉన్నారు.

2011లో వైసీపీ పార్టీలో చేరిన గ్రంధి శ్రీనివాస్ 2014లో వైసీపీ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి పరాజయం పాలయ్యారు. తిరిగి 2019లో మరోసారి వైసీపీ నుండి పోటీ చేసి జనసేనాని పవన్ కళ్యాణ్‌ను ఓడించి పొలిటికల్ సర్కిల్స్‌లో హీరో అయ్యారు. అయితే వైసీపీలో గ్రంధి శ్రీనివాస్‌కు వ్యతిరేకంగా క్షేత్రస్థాయిలో కొంతమంది నాయకులు, తాడేపల్లిలో జగన్ కోటరీ పనిచేయడంతో పవన్ కళ్యాణ్ మీద విజయం సాధించినప్పటికీ ఆయనకు మంత్రి పదవి దక్కలేదు. రెండో విడతలో కచ్చితంగా మంత్రి పదవి దక్కుతుందని గ్రంధి శ్రీనివాస్ ఆశించినప్పటికీ అప్పుడు కూడా నిరాశే మిగిలింది.

అయితే ఆ సమయంలో అనేకమంది సన్నిహితులు వైసీపీని వీడాలని గ్రంధి శ్రీనివాస్‌కు సూచించినప్పటికీ ఆయన వినలేదు. చివరలో ఎన్నికలకు నాలుగైదు నెలలు ముందు తెలుగుదేశం పార్టీ నుండి గ్రంధి శ్రీనివాస్‌కు ఆహ్వానం కూడా వెళ్లిందంటారు. ఆ ఆహ్వానాన్ని కూడా గ్రంధి తిరస్కరించి 2024 ఎన్నికల్లో వైసిపి నుండి పోటీ చేసి పరాజయం పాలయ్యారు. ఆ క్రమంలో వైసిపి రాజకీయలతో విసుగు చెందిన గ్రంధి శ్రీనివాస్ పార్టీకి రాజీనామా చేశారు.

ప్రస్తుతం భీమవరం నియోజకవర్గంలో గ్రంధి శ్రీనివాస్ రాజకీయ భవిష్యత్తుపై కూటమి నాయకులు రకరకాల ప్రచారాలు చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీలోకి వస్తారని కొంతమంది, కాదు జనసేన పార్టీలో చేరతారని మరి కొంతమంది బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. అయితే ఇప్పటివరకు గ్రంధి శ్రీనివాస్ నోరు విప్పడం లేదు. సామాజికపరంగా, ఆర్థికంగా ఉభయగోదావరి జిల్లాలోనే గ్రంధి శ్రీనివాస్ అంటే ఒక బ్రాండ్ ఉంది. కూటమి నాయకులు తమ పార్టీల్లోకి ఆహ్వానిస్తున్నప్పటికీ ఆయన ఎందుకు ఇంకా నిర్ణయం తీసుకోవడం లేదు అని చర్చ జరుగుతుంది.

భీమవరం నియోజకవర్గంలో గ్రంధి శ్రీనివాస్‌కు పార్టీలతో సంబంధం లేకుండా వ్యక్తిగతంగా 35 శాతం వరకు ప్రజల మద్దతు ఉందని 2004 నుండి 2024 వరకు జరిగిన ఎన్నికల తీరు చూస్తే అర్థమవుతుంది. అలాంటాయన అన్ని పార్టీలు తలుపులు తెరుస్తున్నా డెసిషన్ తీసుకోకపోతుండటం సొంత అనుచరులకే మింగుడుపడటం లేదంట. అయితే ఈ ఏడాది మే నెల దాటిన తర్వాత గ్రంధి శ్రీనివాస్ తన నిర్ణయం ప్రకటిస్తరన్న ప్రచారం గట్టిగానే జరుగుతోంది. మరి చూడాలి ఆయన అడుగులు ఎటు పడతాయో